పోలీసులపై జేసీ దౌర్జన్యం | JC Diwakar Reddy Uses Unparliamentary Words On Police Today | Sakshi
Sakshi News home page

పోలీసులపై జేసీ దౌర్జన్యం

Published Mon, Jan 4 2021 1:42 PM | Last Updated on Tue, Jan 5 2021 5:05 AM

JC Diwakar Reddy Uses Unparliamentary Words On Police Today - Sakshi

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్‌ సోమవారం ఆమరణ దీక్షలంటూ హడావుడి చేశారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. బండబూతులు తిట్టారు. విధి నిర్వహణలోని ఓ కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. సీఐ, ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. జేసీ తీరుపై డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను ఇష్టారాజ్యంగా దూషిస్తే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలు.. తమపై అట్రాసిటీ కేసులు నమోదు చేయడం సరికాదంటూ సోమవారం తాడిపత్రిలో తన సోదరుడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆమరణ దీక్ష చేస్తానంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఇదివరకే ప్రకటించారు. నియోజకవర్గంలో 144 సెక్షన్‌తో పాటు 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంది.

ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినా.. వారిని రెచ్చగొట్టేందుకు జేసీ సోదరులు దీక్షకు సిద్ధమయ్యారు. 149 సీఆర్‌పీసీ కింద ముందే నోటీసులిచ్చినా.. తన సోదరుడి ఇంటికి వెళ్లి దీక్ష చేసేందుకు పెద్దపప్పూరులోని తన ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరిన దివాకర్‌రెడ్డిని డీఎస్పీతో పాటు సీఐలు మురళీధర్‌రెడ్డి, ఇస్మాయిల్, ఎస్‌ఐలు గౌస్, రాజశేఖర్‌రెడ్డి, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై జేసీ దివాకర్‌రెడ్డి దూషణలకు దిగారు. పత్రికల్లో రాయలేని పదజాలంతో కానిస్టేబుల్‌పై తిట్లపురాణం అందుకున్నారు. ‘అధికారం ఉందికదా అని రెచి్చపోతున్నారు. ఎవరు మీరు నా గదిలోకి రావడానికి. నీయబ్బా.. మీ ప్రభుత్వం కథ నేను చూస్తా. మా ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తా..’ అంటూ చిందులు తొక్కారు. పోలీసులు ఆయన్ని బలవంతంగా గదిలోకి పంపించారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. 

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ 
బస్టాండ్‌ సర్కిల్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ఇంట్లో దీక్షకు కూర్చోవాలని బయలుదేరిన ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని హౌస్‌ అరెస్టు చేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన జేసీ ప్రభాకర్‌రెడ్డి సతీమణి ఉమారెడ్డిని మహిళా పోలీసులు అడ్డుకుని ఇంటికి తరలించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి తన నివాసంలో మూడుగంటల పాటు దీక్ష చేశారు. కొందరు మహిళలు నిమ్మరసం అందజేసి ఆయనతో దీక్ష విరమింపజేశారు.  (చదవండి: బీటెక్‌ రవికి 14 రోజుల రిమాండ్‌: జైలుకు తరలింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement