కమలం గూటికి మోత్కుపల్లి? | Senior Leader Motkupalli Narasimhulu May Join In BJP | Sakshi
Sakshi News home page

కమలం గూటికి మోత్కుపల్లి?

Published Mon, Aug 12 2019 12:05 PM | Last Updated on Mon, Aug 12 2019 3:22 PM

Senior Leader Motkupalli Narasimhulu May Join In BJP - Sakshi

సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాషాయం కండువా కప్పుకోబోతున్నారా.. అందుకు ముహూర్తం కూడా ఖరారైందా.. అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిస్థితులు. బీజేపీ రాష్ట్ర నాయకులు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మోత్కుపల్లి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం, మోత్కుపల్లి సుముఖత వ్యక్తం చేయడం, వెంటనే తన అనుచరులతో మంతనాలు జరపడం అందుకు బలా న్ని చేకూరుస్తున్నాయి. 

సాక్షి, యాదాద్రి : తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో మంచి పేరుండి, జనబలం కలిగిన రాష్ట్ర స్థాయి నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీజేపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి వెళ్లి  పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై పరస్పరం చర్చించిన అనంతరం   మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల 25న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు మోత్కుపల్లి ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. కాగా భారీ అనుచరగణంతో పార్టీలో చేరడానికి మోత్కుపల్లి సిద్ధం అవుతున్నారు. కార్యకర్తలు, తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. 

బీజేపీకి పెరగనున్న బలం
ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి ఆ«ంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వెలుగు వెలిగిన మోత్కుపల్లి నర్సింహులు.. తమ పార్టీలో చేరడం వల్ల లాభిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలు స్తోంది. మోత్కుపల్లి బీజేపీలో చేరితే మరో మారు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల కం అయ్యే అవకాశం లేకపోలేదు. మోత్కుపల్లి చేరికతో రాష్ట్రంలో బీజేపీకి అదనపు బలం చేకూరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 

అప్పట్లో చంద్రబాబుపై ధ్వజం
టీటీడీపీలో సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు తనకు గవర్నర్‌ పదవి వస్తుందని చంద్రబాబుహామీతో అప్పట్లో మూడేళ్లుకు పైగా ఎదురుచూశారు. గవర్నర్‌ పదవి ఇప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. పేదవాడిని కావడం వల్లే పదవులు రావడం లేదని ఆయన చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.టీడీపీలో సామాజిక న్యాయం లేదని  కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపణలు చేశారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశా డు. దీంతో గత ఎన్నికల ముందు మోత్కుపల్లిని టీడీపీ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించిం ది. అనంతరం మోత్కుపల్లి  ప్రజావేదికను పునరుద్ధరించి చంద్రబాబు ఓటమి లక్ష్యంగా తనదైన శైలిలో పని చేశారు. అయితే ఒకానొక దశలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న ప్రచారం ఎన్నికల ముందు జోరుగా సాగింది. అయితే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్‌ మద్దతుతో ఆలేరులో పోటీ చేసి ఓడిపోయారు. కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. 

మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం 
1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశంను స్థాపించినప్పుడు మోత్కుపల్లి విద్యార్థి దశలోనే పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో  ప్రత్యేక కారణాలతో టీడీపీనుంచి టికెట్‌ రాకపోవడంతో 1989లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు, 1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుం చి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అ నంతరం చోటు చేసుకున్న పరిణామాలతో 1999లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆలేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  2004లో టీడీపీ తరఫున ఆలేరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2008లో మరోసారి ఆలేరులో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీ చేసి ఓడిపోయారు. 

విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి..
మోత్కుపల్లి నర్సింహులు విద్యార్థి దశలోనే ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరా రు. సుధీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా పని చేశారు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో గనులు, వి ద్యుత్‌ శాఖ, సాంఘిక సంక్షేమం,  టూరిజం శా ఖ మంత్రిగా వేర్వేరు సమయాల్లో పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ మోత్కుపల్లి నర్సింహులు ఓ వెలుగు వెలిగారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement