పలు పార్టీల నేతల మద్దతు కోరుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. లోక్‌సభలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పలు జాతీయపార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, ఎంఐఎం పార్టీలు మద్దతు ప్రకటించాయి. జాతీయస్థాయిలో పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా రాజకీయపార్టీల మధ్దతు కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
వాయిదా వేయడం అన్యాయం: వైవీ సుబ్బారెడ్డి
ఆర్డర్‌లోని లేదని లోక్‌సభను వాయిదా వేయడం అన్యాయమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వెల్‌లోకి వచ్చి ఎంపీలు ఆందోళన చేస్తున్నారనే సాకుతో సభను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు. ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేసినా ఆర్థికబిల్లును ఎలా ఆమోదించారని సూటిగా అడిగారు. ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతామని, జాతీయపార్టీల మధ్దతు కూడగట్టి అవిశ్వాసతీర్మానాన్ని నెగ్గించుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో ఎన్డీఏ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని విమర్శించారు.
మరోసారి నోటీసు
లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి నోటీసు ఇచ్చింది. దీనిపై సభలో సోమవారం చర్చ చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment