సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్... రాబోయే ఎన్నికల్లోగా టీ.టీడీపీని ఖాళీ చేయించేందుకు భారీ స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణ టీడీపీ ఓటు బ్యాంక్‌పై కన్నేసిన హస్తం పార్టీ...రేవంత్ రెడ్డి ద్వారా పలువురు నేతలను పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలను కాంగ్రెస్‌లోకి వచ్చేలా మంతనాలు సాగిస్తోంది. ఇందుకోసం జిల్లాల వారీగా నేతలతో చర్చలు జరుపుతోంది. వీలైనంత ఎక్కువమంది టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచనగా కనిపిస్తోంది.
ఇప్పటికే రేవంత్ రెడ్డి సైకిల్ దిగి, హస్తానికి చేయందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతోంది. అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న టీ. టీడీపీ నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో భారీగా వలసలు ఉంటాయనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్న రేవంత్, ఇవాళ వేం నరేందర్ రెడ్డి రాజీనామాలు చేయగా, తాజాగా పటేల్ రమేష్ రెడ్డి, బెల్లయ్య నాయక్, రాజారాం యాదవ్ కూడా రాజీనామాలు చేశారు.
అదే బాటలో మరికొందరు టీడీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 31న రేవంత్‌తో పాటుగా మరో 30మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఓటుకు కోట్లు కేసు అనంతరం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శ వినిపిస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో టీడీపీ దెబ్బతినడానికి చంద్రబాబు తీరే కారణమని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment