
వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతున్న సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదు కోట్ల ఆంధ్రులకు అపర సంజీవని వంటి ‘ప్రత్యేక హోదా’ సాధన కోసం పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు మద్దతు వెల్లువెత్తుతోంది. ఆమరణ నిరాహారదీక్ష మూడోరోజుకు చేరుకుంది. ఎంపీలందరిలోనూ పెద్దవారైన మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండోరోజైన శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 73 ఏళ్ల రాజమోహన్‌రెడ్డి వయసు సహకరించకపోయినా అకుంఠిత దీక్షతో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం ఉదయం వాంతులతో ఇబ్బందికి గురైనా దీక్ష కొనసాగించారు.
సాయంత్రానికి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు ఎంపీలు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా హక్కుగా లభించిన ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ దేశరాజధానిలో వైఎస్సార్‌కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్న దీక్షకు సంఘీభావం పెరుగుతోంది. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి దీక్షా శిబిరాన్ని సందర్శించి ఎంపీలకు సంపూర్ణ మద్దతు తెలిపారు. తొలిరోజైన శుక్రవారం సాయంత్రం భారీ ఈదురుగాలులు, వర్షానికి దీక్షా శిబిరం నేలమట్టమైనప్పటికీ మొక్కవోని దీక్షతో ఏపీ భవన్‌లో వీరంతా నిరశన కొనసాగించారు. శిబిరాన్ని తిరిగి సిద్ధం చేయడంతో శనివారం దీక్షలను అక్కడికి మార్చారు.
క్షీణించిన మేకపాటి ఆరోగ్యం..
శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో విపరీతమైన తలనొప్పి, హైబీపీ, వాంతులతో మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు దీక్ష విరమించాల్సిందిగా కోరారు. అయితే దీక్ష విరమించేందుకు అంగీకరించని మేకపాటి ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినా లెక్కచేయకుండా తన దీక్షను కొనసాగించారు. ఉదయం 11 గంటలకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు మేకపాటి బీపీ 150/90, షుగర్ లెవెల్స్ 119, పల్స్‌రేటు 76గా ఉన్నాయి. ఈ క్రమంలో సాయంత్రం మేకపాటి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏపీ భవన్ రెసిడెంట్ డాక్టర్ బల్లా, రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన డా.అఫీన్, డా.పాప్రీలు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం బీపీ 180/80కి చేరుకోవడంతో దీక్ష కొనసాగిస్తే తీవ్ర ప్రభావాలు ఉంటాయని, విరమించాల్సిందిగా సూచించారు.
అయినా దీక్షను విరమించేందుకు మేకపాటి నిరాకరించారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆంబులెన్స్‌లో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకొనేందుకు ప్రయత్నించాయి. పోలీసులు మేకపాటిని బలవంతంగా ఆంబులెన్స్ ఎక్కించి సమీపంలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మేకపాటిని ఐసీయూలో ఉంచి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వాంతులు ఆగకపోవడంతో ఆదివారం ఉదయం వరకు ఐసీయూలోనే ఉండాలని సూచించారు. అబ్జర్వేషన్ అనంతరం తదుపరి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇతర ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి తమ దీక్షను కొనసాగిస్తున్నారు. కాగా, దీక్షలో ఉన్న ఎంపీలు వివిధ జాతీయ, ప్రాంతీయ టీవీ చానెళ్లతో మాట్లాడుతూ.. తామెందుకు పోరాటం చేస్తున్నదీ వివరించారు.
విభజన వల్ల ఏపీ ఎంత అన్యాయం అయిపోయిందీ, అలాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ యువకులు, విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి లేక ఎంతగా నష్టపోయేదీ ఎంపీలు వారికి తెలిపారు. ప్రత్యేక హోదా ఏమీ భిక్ష కాదని, అది తమ హక్కు అని వారు నిర్ద్వంద్వంగా చెప్పారు. ఎంపీలు చేస్తున్న ఈ నిరాహారదీక్ష మొత్తం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో గట్టిగా నినదించడంతో పాటు వరుసగా అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలివ్వడమే కాక, అమరణ దీక్షకు పూనుకోవడం ఢిల్లీ వర్గాల్లో బాగా చర్చనీయాంశం అయింది. అందుకే ఢిల్లీ నలుమూలల నుంచీ ఆంధ్రులు తమ కుటుంబీకులతో కలిసి వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు.
ఆరోగ్యం క్షీణించడంతో వాంతులు చేసుకుంటున్న మేకపాటి
Comments
Please login to add a commentAdd a comment