సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు రావాలని, సార్వత్రిక ఎన్నికల ఫైనల్ ముందు సెమీఫైనల్ ఆడితే, ఎవరి సత్తా ఏంటో తేలుతుందని మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు. తమ పార్టీకి ఏడు సీట్లు కూడా రావన్న టీఆర్‌ఎస్ వ్యాఖ్యలను ఎద్దేవా చేసిన ఆయన, రాబోయే రోజుల్లో సునామీ వస్తుందన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గ్రహించాలని కోరారు.
30–40 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తరిమికొట్టే రోజులు ఆసన్నమయ్యాయని షబ్బీర్ వ్యాఖ్యానించారు. మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డీవోపీటీ విభాగం రాష్ట్రానికి లేఖ రాసిందని వార్తలు వస్తున్నాయని, ఇందులో నిజమేంటో సీఎం కేసీఆరే చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. ప్రతిపాదన నిజంగానే వెనక్కు వచ్చిందా, అందులో ఏమేం అభ్యంతరాలున్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలనే విషయాన్ని అధికారికంగా చెప్పే బాధ్యత సీఎంపైనే ఉందని ఆయన అన్నారు.
అవి పిల్ల చేష్టలు
సతీమణి ఎన్నికల్లో పోటీ చేస్తారన్న వార్తలను ఖండించిన భట్టి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే అంటూ కొందరు వాట్సాప్‌లో పెట్టడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. అలాంటి చర్యలు పిల్ల చేష్టల్లాంటివని ఆయన పేర్కొన్నారు. ఆ జాబితాకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి తన భార్య నందిని పోటీచేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రమంతటా తిరుగుతున్నందువల్ల మధిర నియోజకవర్గ కార్యకర్తలకు తన భార్య అందుబాటులో ఉంటుందని వివరించారు. ఖమ్మం లోక్‌సభ స్థానానికి పోటీచేసేందుకు జిల్లాకు చెందిన సీనియర్ నేతలున్నారని, వాళ్లకే అవకాశం ఇస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment