సాక్షి, చెన్నై: బీజేపీలోకి చేరడానికి చిన్నమ్మ శశికళ నమ్మినబంటు పుహళేంది సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అయితే, చిన్నమ్మతో సంప్రదింపుల తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, ఆ పార్టీ అధికార ప్రతినిధి పుహళేంది మధ్య సాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు ఆయనతో టచ్‌లోకి వచ్చినట్టు సమాచారం. మంచి వ్యాఖ్యాతగా ఉన్న ఆయన్ను తమ వైపునకు తిప్పుకుంటే ఉపయోగపడుతాడనే భావనతో కమలనాథులు ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది. అయితే.. చిన్నమ్మ శశికళతో సాగే భేటీ మేరకు తదుపరి తన నిర్ణయాన్ని ప్రకటించాలని సంకల్పించి ఉన్నా, కమలనాథుల ఆహ్వానంపై కృతజ్ఞతలు తెలిపే విధంగా పుహళేంది స్పందించడం గమనార్హం.
ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన పుహళేంది...చిన్నమ్మ శశికళ త్వరలో బయటకు రానున్నారని, ఆమె రాకతో అన్నీ సర్దుకుంటాయని వ్యాఖ్యానించారు. ఒక్క జయకుమార్ తప్ప..సీఎంతో పాటు మిగిలిన మంత్రులు ఎవరూ కూడా శశికళకు వ్యతిరేకంగా స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఆమె బయటకు వస్తే, పరిస్థితులు అన్నీ మారుతాయని, ఆమె త్వరలో వస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి తనకు ఆహ్వానం పలికినట్టుగా మీడియాల్లో వార్తలు చూశానని, అలా జరిగి ఉంటే.. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. చిన్నమ్మ రాకతో అందరూ ఆమె చుట్టు చేరుతారని, ఇది జరిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, దినకరన్ మీడియాతో మాట్లాడుతూ చిన్నమ్మ శశికళ విడుదలకు తగ్గ చర్యలు, ప్రయత్నాలు వేగవంతం చేసి ఉన్నట్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ దృష్ట్యా, శశికళ ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నం అవుతోందని ఆమె అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment