బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా (ఫైల్ ఫొటో)
చంఢీఘడ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి అసంతృప్తి వెళ్లగక్కారు. చండీఘడ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిన్న (ఆదివారం) మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరినప్పుడు అటల్ బిహారి వాజ్‌పేయి వంటి ఎంతో మంది గొప్ప నాయకులు ఉండేవారని వ్యాఖ్యానించారు. వారి ప్రభావం వల్లే పార్టీలో చేరానన్నారు. అప్పట్లో అందరి అభిప్రాయాలకు విలువ ఉండేదని.. కానీ ప్రస్తుతం బీజేపీ నరేంద్ర మోదీ పార్టీగా మారిందని.. ఇక్కడ టూ మెన్ షో నడుస్తోందంటూ విమర్శించారు. వ్యక్తి కన్నా వ్యవస్థ, పార్టీ కన్నా జాతి గొప్పదనే విషయాన్ని గుర్తించినపుడే బాగుపడుతామంటూ ఆయన హితవు పలికారు.
పార్టీని వీడను..
బీజేపీ తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న శత్రుఘ్న సిన్హా.. ‘ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. ఈ బిహారి బాబు(శత్రుఘ్న సిన్హా)ను వారు(బీజేపీ) ఎక్కడికీ ఆహ్వానించరు. తగినంత గుర్తింపు ఇవ్వరు. ఢిల్లీలో బీజేపీ ఓడిపోయినప్పుడు నేను పార్టీని వీడే అవకాశాలు వచ్చాయి. కానీ నేను అలా చేయలేదు. ఇప్పటికీ పార్టీని వీడాలనుకోవడం లేదు. ఒకవేళ అధిష్టానం నిర్ణయిస్తే అప్పుడు ఆలోచిస్తానంటూ’ వ్యాఖ్యానించారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తనను రెబల్ అంటున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాగా ఇప్పటి వరకు మీపై అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆర్‌ఎస్సెస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) హస్తం ఉందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు బదులుగా.. అవును బహుశా ఆ కారణం వల్లే తానింకా పార్టీలోనే ఉన్నానేమోనంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment