‘ఆమె ఆడపులి.. రెచ్చగొట్టకండి’ | Shatrughan Sinha Tweet Support For Mamata Banerjee | Sakshi
Sakshi News home page

‘ఆమె ఆడపులి.. అనవసరంగా రెచ్చగొట్టకండి’

Published Mon, Jun 10 2019 11:02 AM | Last Updated on Mon, Jun 10 2019 12:56 PM

Shatrughan Sinha Tweet Support For Mamata Banerjee - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ సర్కారుకు మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. బెంగాల్‌లో హింసపై కేంద్రహోంశాఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మమత వ్యతిరేకంగా జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మమత,, జై శ్రీరాం అన్న వారందరినీ అరెస్ట్‌ చేయాలని పోలీస్‌ శాఖను ఆదేశించింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా మమతకు మద్దతుగా నిలిచారు. ఆమె బెంగాల్‌ ఆడపులని.. ఆమెను రెచ్చగొట్టవద్దని అన్నారు.

‘ఇప్పటిదాకా చేసింది చాలు. బెంగాల్‌ నేల నుంచి వచ్చిన గొప్ప నేత, ఆడపులి మమతాబెనర్జీ. ఆమెను రెచ్చగొట్టే విధంగా అనవసర ప్రయత్నాలు వద్దు. ఈ డ్రామాలు, పోస్టుకార్డు యుద్ధాలు ఇక ఆగాలి. మతం పేరుతో రాజకీయాలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. ఓ మహిళా నేత పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఈ దేశం మొత్తం చూస్తోంది. రాముడు, కృష్ణుడు, దుర్గా, కాళీమాత ఇలా దేవుళ్లందరికీ మనం భక్తులమే. పరిస్థితులను కావాలనే మరింత దిగజారాలే చేయడం ఎందుకు ? ’ అని శతృఘ్న సిన్హా వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. 

ఇటీవల రెండు మూడుసార్లు మమతాబెనర్జీని అడ్డుకున్న కొందరు యువకులు జైశ్రీరామ్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె కారు దిగి వారిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో దీదీ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జైశ్రీరామ్‌ నినాదంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ భాజపా నేతలు కావాలనే ఆ నినాదంతో మత రాజకీయాలకు తెరలేపి బెంగాల్‌లో ఆందోళనలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement