న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘మౌనీ బాబా’గా శివసేన అభివర్ణించింది. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు దేశంలోని సమస్యల గురించి మాట్లాడుతారని ఎద్దేవా చేసింది. దేశ రాజధాని లండన్, న్యూయార్క్, టోక్యో, లేదా ప్యారిస్‌కు మార్చాలని, అలా కుదరకుంటే.. న్యూఢిల్లీనే విదేశీ నగరంలా కనిపించేవిధంగా సినిమా సెట్టింగ్‌తో రూపొందించాలని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’లో ‘మన్మోహన్ మోదీ’ పేరిట ఓ సంపాదకీయాన్ని ప్రచురించింది.
మరింతగా మాట్లాడాలని మోదీకి మన్మోహన్ ఇచ్చిన సలహా సముచితమైనదేనని, ఇదే భావనను దేశమొత్తం వ్యక్తం చేస్తోందని శివసేన పేర్కొంది. "అయినా మన్మోహన్ సింగ్ చెప్పింది అర్ధ సత్యమే. మోదీ భారతదేశంలో మౌనీ బాబాగా మారిపోతారు. విదేశాలకు వెళితే మాట్లాడుతారు. దేశంలో తప్పక మాట్లాడాలని ఆయన అనుకోవడం లేదు. దేశంలో జరిగే సంఘటనలు ఆయనకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అందుకే విదేశాలకు మళ్లినప్పుడు ఆయన దేశంలోని సమస్యల గురించి మాట్లాడుతున్నారు’ అని అది పేర్కొంది.
‘దేశంలో జరిగిన రేప్ కేసుల గురించి ప్రధాని లండన్‌లో మాట్లాడారు. ఇది ఆయనలోని సున్నితత్వం. అన్యాయాలపై ఆయన భావోద్వేగానికి లోనవుతారు. ఆ భావోద్వేగపు నిప్పురవ్వ విదేశాలకు వెళ్లగానే భగ్గుమంటుంది’ అంటూ ‘సామ్నా’ పేర్కొంది. రేప్ కేసులపై రాజకీయం చేయొద్దని మోదీ అంటున్నారని, కానీ నిర్భయ కేసు విషయంలో ఆయన వైఖరి ఇందుకు భిన్నంగా ఉందని గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment