
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మరోసారి హైడ్రామా నెలకొంది. రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పరేడ్ (బలప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. సోమవారం రాత్రి 7గంటల తరువాత 162 మంది ఎమ్మెల్యేలతో ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌కు చేరుకోనున్నారు. ఎమ్మెల్యేలంతా ఒకదగ్గరకు చేరుకున్నాక వారందరితో పరేడ్ (బలప్రదర్శన) చేయాలని నిర్ణయించారు. పరేడ్‌గా వెళ్లి ఎమ్మెల్యేలంతా గవర్నర్‌ను కలువనున్నారు. దీని కోసం ఇప్పటికే సభ్యులంతా సిద్ధమయ్యారు. సభ్యులంతా మా బలం 162 మంది అంటూ ప్లేకార్డులు ప్రదర్శిస్తున్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో పాటు, శరద్ పవార్, సుప్రియా సూలే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదివరకే అక్కడకు చేరుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీకి సవాలు విసిరారు. ప్రస్తుతం తమ వద్ద 162 మంది శాసనసభ్యులు ఉన్నారని, అవసరమైతే స్వయంగా వచ్చి చూసుకోవాలని అన్నారు. కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు పూర్తి మెజార్టీ ఉందని, కానీ బల నిరూపణకు గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదని రౌత్ పేర్కొన్నారు. దీంతో బహిరంగ బలప్రదర్శనకు దిగుతున్నట్లు వెల్లడించారు. తాజా పరిణామంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత మరింత వేడెక్కాయి.