ముంబై : గోవాలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిందని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన విమర్శించింది. అధికారం కోసం సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. ‘ మనోహర్ పరీకర్ భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు. కానీ అదే సమయంలో బీజేపీ నీచ రాజకీయ క్రీడకు తెరతీసింది. అధికార వ్యామోహంతో అర్ధరాత్రి కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. మరో నాలుగు గంటలు ఆగితే ఏం పోయేది. బీజేపీ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం’ అని బీజేపీ తీరును ఎండగట్టింది.
చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా?
బీజేపీ మాట తప్పింది..
డిప్యూటీ సీఎంల నియామకం గురించి ప్రస్తావిస్తూ... ‘నాలుగేళ్ల క్రితం బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఇవ్వమని చెప్పిన బీజేపీ.. అధికారం కోసం మాట తప్పింది. కేవలం 19 ఎమ్మెల్యేలలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించింది. నేటికీ మనోహర్ పరీకర్ మరణాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా జాతీయ జెండాను హాఫ్ మాస్ట్ చేసే ఉంచారు. కనీసం అలా ఎందుకు చేస్తారోనన్న విషయం గురించి బీజేపీ వాళ్లకు కాస్తైనా అవగాహన ఉందో లేదో’ అంటూ సామ్నాలో శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా కేంద్రం, రాష్ట్రంలో తమతో అధికారం పంచుకున్న శివసేన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిత్రపక్షంపై విమర్శలు సంధిస్తున్న శివసేన...సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ పార్టీతో జట్టు కట్టడం విశేషం.
ఇక పదవిలో ఉండగానే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరిపింది. తమ పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్‌లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిచ్చింది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment