బాధితుడిని పరామర్శిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరి సాంబశివారెడ్డి, పైలా నర్సింహయ్య
కక్షలు, కార్పణ్యాల జోలికి వెళ్లకుండా గ్రామప్రజలందరితో కలిసిపోయి జీవిస్తున్న వ్యక్తిపై పోలీసులు రెచ్చిపోయారు. ఊరు నుంచే కాదు ఏకంగా మండలం వదిలి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. ఎందుకు వెళ్లాలని ప్రశ్నించినందుకు ఆ వ్యక్తిపై చేయి చేసుకుని, స్టేషన్‌కు పిలిపించి మరీ తమదైన శైలిలో పోలీస్ కౌన్సెలింగ్ ఇచ్చారు. సిగరెట్‌తో శరీరంపై కాల్చి గాయపరిచారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం, యల్లనూరు: అచ్యుతాపురానికి చెందిన ఈశ్వర్‌రెడ్డి పద్దెనిమిదేళ్ల కిందట గ్రామకక్షల కారణంగా ఊరు వదిలి వెళ్లాడు. రెండు నెలల కిందటే తిరిగి స్వగ్రామం చేరుకున్నాడు. కక్షల జోలికి వెళ్లకుండా వ్యవసాయం చేసుకుని ప్రశాంతంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. సొంతింటిని బాగు చేసుకుని అక్కడే నివాసముంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం యల్లనూరు ఎస్‌ఐ గంగాధర్, సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసుల సహాయంతో అచ్యుతాపురంలో నాకాబందీ నిర్వహించారు. ఈశ్వరరెడ్డి ఇంటిని కూడా తనిఖీ చేశారు. అనంతరం నువ్వు ఇక్కడ నివసించడానికి వీలు లేదని, మండలం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. తానిప్పుడు ఎటువంటి కక్షలు, కార్పణ్యాలకు పోలేదని, అలాంటపుడు గ్రామం వదిలి ఎందుకు వెళ్లాలని ఈశ్వర్‌రెడ్డి ప్రశ్నించాడు. అంతే చిర్రెత్తిపోయిన ఎస్‌ఐ అందరి సమక్షంలో అతనిపై చేయి చేసుకున్నాడు. స్టేషన్‌కు పిలిపించి సిబ్బంది అమర్‌తో కలిసి కాళ్లతో తన్ని చితకబాదారు. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో తొడ, ఇతర శరీర భాగాలపై సిగరెట్‌తో కాల్చారు.
బాధితుడికి వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
పోలీసుల చేతిల్లో చిత్ర హింసలకు గురై సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరరెడ్డిని మధ్యాహ్నం వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి, శింగనమల సమన్వయకర్తలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు పైలా నర్సింహయ్యలు వైద్యులతో ఈశ్వర్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితుడిని పరామర్శించిన వారిలో యల్లనూరు జెడ్పీటీసీ సభ్యుడు కొత్తమిద్దె వెంకటరమణ, ఎంపీపీ మునిప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ గంగాధర్‌ను వివరణ కోసం ‘సాక్షి’ ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment