
సాక్షి బెంగళూరు : రాష్ట్రంలో నిద్రపోయేవారికి కాకుండా పని చేసే వారికి ఓటేయండి అని మాత్రమే తాను వ్యాఖ్యానించినట్లు, అందులో తప్పేమీ ఉందని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు. శుక్రవారం బాదామిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రతిష్ట, ప్రభావం మసకబారుతుందనడానికి బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు ఎవరని ప్రశ్నించారు. తన భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలు మాత్రమేనని, ఇలాంటి వ్యాఖ్యలను తాను ఏమాత్రం పట్టించుకోనన్నారు. కాంగ్రెస్ నుంచి చెదిరిపోయిన వెనుకబడిన తరగతులను ఏకం చేసేందుకు త్వరలో సమావేశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అదే విధంగా లోకసభ ఎన్నికల్లో ఓటమిపై క్షేత్ర స్థాయిలో సమాలోచనలు చేస్తున్నామని సిద్ధరామయ్య పేర్కొన్నారు. శాసనసభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఆపరేషన్ కమలం అంటూ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని ఎద్దేవా చేశారు. కాగా బాదామిలో ప్రజల నుంచి విజ్ఞప్తులు అందుకుంటున్న సందర్భంగా ఒక వితంతువు విజ్ఞప్తికి చలించి రూ. 50 వేల సొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాల మహిళ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు. ఇటీవల పిడుగు పడి భర్త మరణించడంతో సదరు మహిళ కుటుంబం రోడ్డున పడింది.
Comments
Please login to add a commentAdd a comment