సాక్షి, ఆత్మకూరు (కె) : నాలుగేళ్ల చంద్రబాబు పాలన వంచన మయమని వైఎస్సార్‌సీపీ నేత శిల్పాచక్రపాణి రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట తప్పడమే చంద్రబాబు నైజమని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. నాలుగేళ్లలో అభివృద్ధి శూన్యమని, పాలన గాలికొదిలేసి ప్రజలను దోచుకోవడమే టీడీపీ సర్కార్ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ఘనుడని చంద్రబాబుపై వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. మోసానికి, వంచనకు మారుపేరు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. నాయీ బ్రాహ్మణుల పట్ల చంద్రబాబు వైఖరి సరికాదన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నాయీ బ్రాహ్మణులను ఉద్యోగులుగా గుర్తిస్తామని, వారికి పార్టీ అండగా ఉంటుందని చక్రపాణి రెడ్డి చెప్పారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు చారిత్రాత్మకమని, ఎంపీలు చేసిన త్యాగం ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని అన్నారు. 14 నెలల ముందు పదవులను తృణ ప్రాయంగా వదులుకున్న ఘనత తమ పార్టీ ఎంపీలదని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసుంటే కేంద్రం దిగొచ్చేదని, కానీ స్వప్రయోజనాలకోసం టీడీపీ ముందుకు రాలేదంటూ మండిపడ్డారు.
శ్రీశైలం ఫిరాయింపు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరులు దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని శిల్పా ధ్వజమెత్తారు. నియోజకవర్గ పరిధిలో కమిషన్‌లు ఇస్తే కానీ పనులు జరగని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని అన్నారు. ప్రజలకు అండగా ఈనెల 30న అనంతపురంలో టీడీపీ వంచనపై వైఎస్సార్‌సీపీ గర్జన నిర్వహించనున్నట్లు శిల్పా వెల్లడించారు. అదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో టీడీపీ సర్కార్ వంచనపై గర్జన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment