సాక్షి, హైదరాబాద్ : నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందని ఆయన పేర్కొన్నారు. బాగ్‌లింగపల్లి ఆర్టీసీ కళ్యాణమంటపంలో గురువారం సీపీఎం 22వ జాతీయ మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఉద్యోగాలు వస్తాయని ఆశ పెట్టారు, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలామంది ఉపాధి కోల్పోయారని విమర్శించారు. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, రైల్వేను ప్రైవేటీకరించడానికి మాత్రమే కేంద్రం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఇలాంటి విధానాలకు ప్రత్యామ్నాయం అవసరమని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణలో జరిగే సీపీఎం జాతీయ మహాసభలు దశ, దిశ చూపించాలన్నారు. నోట్లరద్దు వల్ల బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయ్యిందని, వెయ్యి నోటుతో జరిగే అవినీతి ఇప్పుడు రెండువేల నోటుతో జరుగుతోందన్నారు. బీజేపీ అధికారం అడ్డుపెట్టుకొని ఎలక్షన్ కమిషన్, సీబీఐని దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి. మధు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యనేతలు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment