ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు తెలుగు జాతి ప్రయోజనాలను కేంద్రం ఎదుట చంద్రబాబు తాకట్టు పెట్టాడు. వ్యక్తిగత స్వార్థానికి ప్రత్యేక హోదా అంశాన్ని మరుగున పరిచేందుకు అనుక్షణం ప్రయత్నించాడు. హోదా ఉద్యమంలో పాల్గొన్న యువతపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేశాడు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టాడు. బతుకులు బుగ్గిపాలు చేశాడు. ఎన్నికలు సమీపిస్తుండగా ఓట్ల కోసం ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నాడు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ నేపథ్యంలో ‘ప్రత్యేక హోదా–ఉపాధి కల్పన’ అనే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఎస్కేయూ వేదికగా విద్యార్థి జేఏసీ మంగళవారం చర్చావేదిక నిర్వహించింది. రాజకీయ నిర్ణయాలతో పాటు విధానపరమైన నిర్ణయాలు, విలువలు, విశ్వసనీయత ఉన్న నాయకుడికే పట్టం కట్టాలని, ఆ మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జేఏసీ తీర్మానించింది.
ప్రత్యేక హోదా సంజీవనే
- ప్రత్యేక హోదాతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలు ఒక్కో హైదరాబాద్‌గా రూపొందుతాయి.
- పన్నురాయితీలు, ప్రోత్సాహకం వల్ల జనంలో కొనుగోలు శక్తి పెరుగుతుంది.
- ఉత్పత్తి చేసే వస్తువుల మీద 100 శాతం పన్ను రాయితీ ఉండడం వల్ల ధరలు సగానికి సగం తగ్గుతాయి.
కేంద్ర ప్రభుత్వ నిధులు ఇలా..
- ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పన్నుల్లో వాటాతో పాటు గ్రాంట్లు, రుణాల ద్వారా రాష్ట్రాలకు సొమ్ము అందుతుంది. గ్రాంట్లను తిరిగి చెల్లించనక్కర్లేదు.
- ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు 30 శాతం మించి ఉండవు. అంటే ఏ పథకం, ఏ కార్యక్రమం చేపట్టినా .. కేంద్ర గ్రాంట్ పోనూ తక్కిన 70శాతం మొత్తాన్ని లోనుగా చెల్లించాలి. అదే ప్రత్యేక హోదా వస్తే కేంద్రం గ్రాంట్ 90 శాతం వస్తుంది. తక్కిన 10 శాతం లోన్‌గా చెల్లించాలి.
నీటి ప్రాజెక్టులన్నీ కేంద్రమే భరిస్తుంది
యాక్సిలరేటేడ్ ఇరిగేషన్ బెనిఫిట్ స్కీం( ఏఐబీపీ) కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులకు నిధులు ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఈ పథకం కింద 90 శాతం నిధులు గ్రాంట్‌గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. హోదా లేకపోతే కేవలం 20 నుండి 30 శాతం మాత్రమే ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన విదేశీ రుణాలను సైతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ప్రత్యేక హోదా ప్రయోజనం పొందిన రాష్ట్రాల్లో ప్రగతి ఇలా..
- 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రంలో 30,244 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.35వేల కోట్ల పెట్టుబడులతో ఒకే దఫాలో 130 శాతం అధికంగా పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఉపా«ధి అవకాశాలు 490 శాతం పెరిగి , 2,45,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి.
- ఏపీ కన్నా బాగా వెనుకబడ్డ హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏకంగా 10,864 కంపెనీలు పరిశ్రమలను నెలకొల్పి, 1,29,443 మందికి ఉద్యోగాలు కల్పించాయి.
ప్రత్యేక హోదా వల్ల వచ్చే రాయితీలు ఇలా..
- ప్రత్యేక హోదా ఉంటే పారిశ్రామిక యూనిట్లకు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది.
- ఆదాయం మీద పన్ను (ఇన్‌కం ట్యాక్స్)లో కూడా 100 శాతం రాయితీ లభిస్తుంది.
- పన్ను మినహాయింపులు, ఫ్రైట్ రీయింబర్స్‌మెంట్‌లు దక్కుతాయి.
- ప్రత్యేక హోదా వల్ల రాయితీలు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు.
- ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి.
- పరిశ్రమల ఏర్పాటుకు తీసుకునే వర్కింగ్ క్యాపిటల్ మీద కేవలం మూడు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది.
- ఇవే కాకుండా ఇన్సూరెన్స్, రవాణా వ్యయంపైనా రాయితీలు ఉంటాయి.
- గ్రామీణ ప్రాంతాల్లోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వస్తాయి. తక్కువ నైపుణ్యం ఉన్న వారికీ ఉద్యోగాలు, ఉపాధి దక్కుతుంది.
హోదా అంటే జైలుకే అన్నారు
ప్రత్యేక హోదా సాధనకు ఉద్యమాలు చేస్తే జైలుకు పంపుతామంటూ సీఎం చంద్రబాబే బెదిరింపులకు దిగాడు. ఉద్యమకారులపై కేసులు నమోదు చేయించాడు. ఎన్నికలు దగ్గర పడగానే ప్రత్యేక హోదా కావాలంటూ మాట మార్చాడు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తేయలేదు. దీనిని బట్టి చూస్తే ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
– డి. ప్రతాప్‌రెడ్డి, పీజీ విద్యార్థి
ఐదున్నర కోట్ల ప్రజలకు వెన్నుపోటు
ప్రత్యేక హోదా అంశంలో సీఎం చంద్రబాబు ఐదున్నర కోట్ల ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారు. 2014 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ స్పష్టమైన వాగ్దానం చేశారు. తర్వాత చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దంటూ ప్యాకేజీ వైపు మొగ్గు చూపారు. ప్రత్యేక హోదా సాధనకు నాలుగున్న రేళ్లుగా అలుపెరగని పోరు చేస్తున్న వైఎస్ జగన్‌కు ప్రజలు దన్నుగా నిలిచారు. జగన్ సీఎం అయితేనే ప్రత్యేక హోదా సాధన సాధ్యమవుతుంది.
– జీవీ లింగా రెడ్డి, ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు
ప్రభుత్వ సొమ్ముతో ఓట్లకు గాలం
ప్రజల సొమ్ముతో ఓట్లకు గాలం వేసే నూతన పథకానికి సీఎం చంద్రబాబు తెరతీశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడినప్పుడు నిరుద్యోగభృతి చెల్లింపు పేరుతో యువతను ప్రలోభ పెట్టారు. కేవలం స్వార్థపూరిత రాజకీయాలకు ఇలాంటి అంశాలు దోహదపడ్డాయి.
– అమర్‌నాథ్, పీజీ విద్యార్థి, ఎస్కేయూ క్యాంపస్
హామీ అమలు చేయలేదు
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. ఖాళీగా ఉన్న 1.60 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా అరకొరగా పోస్టులు భర్తీ చేశాడు. ఇవీ గత ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించినవే.
– డి. శ్రీనివాస్‌రెడ్డి, ఎంఫిల్, ఎస్కేయూ
నియంతలా వ్యవహరించారు
ఎన్నికల హామీలను చంద్రబాబు కావాలనే నిర్లక్ష్యం చేశాడు. 15 ఏళ్లు కావాలని తిరుపతి బహిరంగసభలో చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అని అడిగితే కేసులు పెడతామని బెదిరించాడు.
– డాక్టర్ శ్రీధర్ గౌడ్, విద్యార్థి జేఏసీ నాయకుడు
దగా చేశారు
అధికారంలోకి వచ్చాక ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టించారు. నిరుద్యోగభృతి పేరుతో దగా చేశారు. దీనికి కూడా సవాలక్ష కొర్రీలు విధించి అర్హులను పూర్తిగా తగ్గించేశారు. ఎన్నికలకు నాలుగు నెలలు ముందు మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.
– వేమన, పీజీ విద్యార్థి
ఉపకార వేతనాలు అందలేదు
వైఎస్సార్ హయాంలో ఎంఫిల్, పీహెచ్‌డీ విద్యార్థులకు ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లుగా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు లేకుండా వెబ్‌సైట్‌లో ఆప్షన్ తొలిగించారు.
– జయంత్, పీజీ, ఎస్కేయూ
నోటిఫికేషన్ ఇవ్వకుండా శిక్షణ
కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. కోట్లలో లబ్ధి పొందే విధంగా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద పనికి మాలిన సంస్కరణలు అమలు చేశారు. ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్లు లేకుండానే ఈ పథకం కింద శిక్షణ ఇప్పించారు.
– డాక్టర్ గణేష్, ఎస్కేయూ
Comments
Please login to add a commentAdd a comment