సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలు, ఇన్నాళ్లూ చేసిన అన్యాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘నిన్ను నమ్మం బాబూ..’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపునకు వచ్చిన నేపథ్యంలో ఈ యాత్రకు సంఘీభావంగా ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకూ చేపట్టాల్సిన ముందస్తు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తూ అన్ని నియోజకవర్గాలకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది.
2017 నవంబరు 6న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో అశేష జనవాహిని మధ్య వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగియనుంది. ఈ యాత్ర ముగింపు సభను ఎప్పటికీ మర్చిపోలేనంత ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు సర్క్యులర్ జారీ చేసింది. పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, పార్లీమెంట్ జిల్లా/ నగర పార్టీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులకు కూడా ఈ సర్క్యులర్ పంపించారు. ఇందులో ఏం పేర్కొన్నారంటే...
‘‘పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, ఆపన్నులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులను సాధించుకునేందుకు అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్న జననేతకు అన్ని వర్గాలవారు నీరాజనం పలుకుతున్నారు. 2014లో చంద్రబాబు చేసిన తప్పుడు ప్రకటనలు, మోసపూరిత హామీల వల్ల నష్టపోయామని, వచ్చే ఎన్నికల్లో ఎన్ని మాయమాటలు చెప్పినా ఇక ‘నిన్ను నమ్మం బాబూ..’ అని ప్రజలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రజా సంకల్పయాత్ర ముగింపు నేపథ్యంలో సంఘీభావం ప్రకటిస్తూ పలు కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలి’’
చేపట్టాల్సిన కార్యక్రమాలు
- జనవరి 2: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు పత్రికా సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యక్రమాల గురించి వివరించాలి.
- జనవరి 3 నుంచి 7: ప్రతి నియోజకవర్గంలో రోజుకు రెండు చొప్పున పది గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలి. ఈ సందర్భంగా ‘నిన్ను నమ్మం బాబూ...’ అనే పెద్ద హోర్డింగ్‌ను తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి.
- సమన్వయకర్తలు గ్రామాల్లో పర్యటించే సమయంలో పార్టీ పంపిన స్టిక్కర్లను అతికించిన వాహనాలనే ఉపయోగించాలి.
- కనీసం 500 మంది గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిచి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. హాజరైన వారితో ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమానికి మద్దతుగా 9121091210 నంబరుకు మిస్డ్ కాల్స్ ఇప్పించాలి. గ్రామాల్లో సమావేశాల తర్వాత ర్యాలీలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలి.
- జనవరి 9న ఇచ్ఛాపురంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ, ర్యాలీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమన్వయకర్తలు పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి, సభను విజయవంతం చేయాలి.
‘నిన్ను నమ్మం బాబూ’
Published Wed, Jan 2 2019 3:29 AM | Last Updated on Wed, Jan 2 2019 3:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment