బాబు అడిగితే ఏదీ ఇవ్వం | Somu Veerraju  Slams Chandrababu For His Corruption | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అడిగితే ఏదీ ఇవ్వం : సోము వీర్రాజు

Published Fri, Jun 29 2018 1:38 PM | Last Updated on Fri, Jun 29 2018 3:33 PM

Somu Veerraju  Slams Chandrababu For His Corruption - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగితే కడప స్టీల్‌ ప్లాంట్‌, రైల్వేజోన్‌ ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అవినీతి పరులకు ఏమాత్రం సహకరించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడో స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ ఏం చేసినా ప్రజల కోసమే చేస్తుందన్నారు. శుక్రవారం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ గుర్తుకురాని స్టీల్‌ప్లాంట్‌ కోసం దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌.. కడపలో మూడపడ్డ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించలేదని ప్రశ్నించారు. టీడీపీకి చెందిన మరో ఎంపీ సుజనా చౌదరి ఈ మధ్య ఎందుకు తెర వెనక్కి వెళ్లిపోయారో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు ప్రజాస్వామ్య ద్రోహిలా మారారని విమర్శించారు. అనంతపురంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై టీడీపీ చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. నేతలపై దాడులను ఆపలేకపోతున్న ఏపీ డీజీపీ తెలుగుదేశం పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా మారిపోవాలని సూచించారు. మోసం చేసిన షేర్ల బ్రోకర్‌ కుటుంబరావు ఏపీ ప్రభుత్వానికి లెక్కలు చెబుతున్నారని గుర్తు చేశారు. బీజేపీపై దాడులతో పాటు టీడీపీ చేస్తున్న ధర్మ పోరాటాలు ఆపాలని అవినీతి చక్రవర్తి చంద్రబాబును హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. కాశ్మీర్‌లో టెర్రరిస్టులకే బీజేపీ భయపడటం లేదని, అలాంటిది చంద్రబాబు తాటాకు చప్పట్లకు మేం ఎలా భయపడతామని వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement