సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ సాక్షిగా టీడీపీ ఎంపీల నాటకాలు బయటపడ్డాయని, ఆ నేతల మాటలను అందరూ వీడియోల్లో చూశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆ వీడియోలు బయటకు రావడంతో మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇక్కడి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం అంబటి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీలకు విభజన హామీలు నెరవేర్చాలనే చిత్తశుద్ది లేదన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ది ఉక్కుదీక్ష కాదు.. తుక్కు దీక్ష అని ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. ప్రజలను నట్టేట ముంచే పనులను టీడీపీ ఎంపీలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధర్మపోరాట దీక్ష చేసే అర్హత లేదన్నారు. ఏపీ అభివృద్ధిపై టీడీపీ చిత్తశుద్ధి ఏంటన్నది సీఎం రమేష్ దీక్షలో, ఢిల్లీలో టీడీపీ ఎంపీల వ్యాఖ్యల సాక్షిగా మరోసారి తేటతెల్లమైందన్నారు. ఎంపీల వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని చంద్రబాబు టీడీపీ నేతలకు నోటీసులివ్వాలని డిమాండ్ చేశారు.
హోదా కోసం చిత్తశుద్ధిగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పోరాటం చేస్తుంటే టీడీపీ నేతలు అవహేళన చేశారు. టీడీపీ నేతలు రాజీనామాలు చేయరు కానీ, విచిత్రంగా దీక్షలు చేస్తారు. లాలుచీ రాజకీయాలు చేసే చంద్రబాబు దీక్షలతో ఒరిగేదేమీ ఉండదు. బీజేపీతో పోరాడుతున్నట్లుగా చంద్రబాబు నాటకాలాడుతున్నారు. చంద్రబాబు పోరాటాలన్నీ నాటకాలు. ఏపీ ప్రజలు నమ్మొద్దని మనవి. ఏ పార్టీతోనైనా కలిసిపోయే విశాల దృక్పథం ఉన్న నేత చంద్రబాబు అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీని విమర్శించడానికే ఏరువాకను టీడీపీ వాడుకుందని చెప్పారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం వృద్ధి మైనస్‌లో ఉందని, వ్యవసాయంపై ఏపీ సీఎంకు ఏమాత్రం ప్రేమ లేదని మరోసారి రుజువైందన్నారు. కమీషన్ వచ్చే రంగాలపైనే చంద్రబాబు దృష్టిసారించారని విమర్శించారు. వ్యవసాయంలో అభివృద్ధి సాధించామని సీఎం చంద్రబాబు తప్పుడు లెక్కలు చూపారని అంబటి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment