సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సున్నాకి తీసుకువచ్చి.. ఇప్పుడు రివ్యూలు చేస్తామనంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఖాళీ డబ్బాలను రివ్యూ చేస్తారా అని చంద్రబాబుని ప్రశ్నించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందన ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. చంద్రబాబు స్పందన దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఓ పార్టీ మూతపడనుందనే అనుమానం కలుగుతుందని తెలిపారు. ఐదేళ్లలో చంద్రబాబు దురాగత పాలనకు, అవినీతికి అంతులేకుండా పోయిందని ఆరోపించారు.
చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా దోపిడిని కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. అందుకే ప్రజలు ఆగ్రహంతో స్పీకర్‌ను చొక్కా విప్పి కొట్టారని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో రైతుల పరిస్థితి బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. మిల్లర్ల నుంచి సివిల్ సప్లయి అధికారులు లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు మిలర్లు తక్కువ ధర ఇస్తుంటే.. అధికారులు అవినీతికి బాటలు వేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకం మీద రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment