లక్నో: ఐదో విడత సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ కూటమి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేవలం అధికారం కోసమే చిరకాల ప్రత్యర్థులపై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తున్నాయని, మహాకల్తీ కూటమి త్వరలో చీలిపోతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై బీఎస్పీ సుప్రీం మాయావతి అదేరీతిలో స్పందించారు. యూపీలో తమ కూటమిని ఎవ్వరూ విడదీయలేరని, మతతత్వ బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమని తేల్చిచెప్పారు. తమ కూటమికి యూపీ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, మే 23 తరువాత మోదీ పదవి నుంచి దిగిపోవడం తప్పదని మాయావతి జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గెలవడం కోసం కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ ఉపయోగించుకుంటోందని మాయా ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తి, ప్రతాప్‌గఢ్, బిహార్‌లోని వాల్మీకినగర్‌లో శనివారం మోదీ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్‌తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌పై దాడి చేయడం గమనార్హమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment