కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి నడయాడిన పవిత్రభూమి.. స్వామివారు కొలువైనశేషాచలం అడవులు..మరోవైపు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం.. నడిమధ్యన విజయసామ్రాజ్యధీశుడు శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగం నాటి తీపిగుర్తుగా రాజఠీవితో ఉన్న చంద్రగిరి కోట..రైతులకు కల్పతరువుగా నిలుస్తున్న స్వర్ణముఖి నది పరవళ్లు.. పచ్చని పండ్లతోటలు.. పండ్లరారాజు మామిడి మార్కెట్‌కు దిక్సూచీలా నిలుస్తోంది చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ నుంచేచంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైతే..ఇక్కడ జనం మాత్రం బాబును కుప్పానికి సాగనంపారు. గల్లా కుటుంబం రెండు దశాబ్దాల పాటు చక్రం తిప్పితే..మొదటిసారే పోటీ చేసి చంద్రగిరిఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రస్తుతం నియోజకవర్గాన్ని శాసిస్తున్నారు.
చిత్తూరు , తిరుపతి రూరల్: నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసే ఇక్కడ ఎన్నికల అనంతరం అన్ని పార్టీలు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుంటాయి. 1978లో చంద్రగిరి నియోజకవర్గంగా రూపుదిద్దుకుంది. నాడు ఇక్కడ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తులను సామాన్యులు ఓడించిన ఘనమైన చరిత్ర ఈ నియోజకవర్గానికే సొంతం. అయితే సమస్యలు కూడా ఇక్కడ తిష్ట వేస్తూనే ఉన్నాయి. తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రానికి తాగునీటిని అందించే తెలుగుగంగా, కల్యాణిడ్యామ్ వంటి తాగునీటి ప్రాజెక్టులు ఈ నియోజకవర్గంలోనే ఉన్నా..గుక్కెడు నీళ్లు ఇక్కడి ప్రజలకు అందని దుస్థితి ఉంది. ఇంటి స్థలాలకు నోచుకోని వారెందరో. దేశ, విదేశాల నుంచి వచ్చే వ్యాపారులతో కళకళలాడే మామిడి మార్కెట్లు ఇక్కడే ఉన్నా..గిట్టుబాటు ధరకు నోచుకోని పేద రైతుల కష్టాలు వర్ణనాతీతం.
నియోజకవర్గ చరిత్ర ఇదీ..
రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గాల్లో చంద్రగిరి ఒకటి. ఓటర్ల పరంగా రాష్ట్రంలోనే మొదటిస్థానం. 1978లో నియోజకవర్గంగా ఏర్పాటైంది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తిరుపతి రూరల్, రామచంద్రాపురం, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పాకాల, చంద్రగిరి ఆరు మండలాలు కలిపి నియోజకవర్గంగా మార్చారు. నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలం జనాభా పరంగా, విస్తీర్ణంగా కూడా అతిపెద్దది. సగం మంది ఓటర్లు ఈ మండలంలోనే ఉన్నారు. తిరుపతి నగరానికి ఒకవైపు శేషాచలం అడవులు ఉంటే, మూడు వైపులా ఈ మండలం చుట్టుకుని ఉంటుంది.
చంద్రబాబును కుప్పానికి తరిమిన సామాన్యుడు..
రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు స్వస్థలం ఈ నియోజకవర్గం పరిధిలోని చంద్రగిరి మండలం నారావారిపల్లి. ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్న చంద్రబాబు యువకుడిగానే 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జనతాపార్టీ అభ్యర్థి పట్టాభిరామచౌదరిపై తక్కువ మెజారిటీతో గెలుపొందారు. తర్వాత మంత్రిగా పనిచేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, మంత్రిగా పనిచేసినా అభివృద్ధిని విస్మరించడంతో 1983లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తిరుపతి రూరల్ మండలం సీమల్లవరానికి చెందిన మేడసాని వెంకట్రామనాయుడు(మీసాల నాయుడు) చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యంత చిత్తుగా ఓడిన వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. చిత్తుగా ఓడిన బాబు మళ్లీ చంద్రగిరిలో పోటీ చేసేందుకు సాహసించలేకపోయారు. చంద్రగిరి నుంచి కుప్పానికి పారిపోయాడు.
గల్లా మార్క్ రాజకీయం..
చంద్రగిరి నియోజకవర్గంపై రాజకీయంగా తిరుగులేని ముద్రను వేసుకున్న వ్యక్తి గల్లా అరుణకుమారి. ప్రముఖ పార్లమెంటేరియన్ పాటూరి రాజగోపాల్‌నాయుడు కుమార్తెగా 1989లో చంద్రగిరి నుంచి పోటీ చేసి, ఎమ్మెల్యేగా గెలిచిన అరుణకుమారి తన రాజకీయ పునాదిగా ప్రతిష్ట పరుచుకున్నది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. మొత్తం ఆరుసార్లు పోటీచేసిన ఆమె నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆమెకు రాజకీయంగా, వ్యాపారపరంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. కీలకమైన శాఖలకు మంత్రిగా చేశారు. కాంగ్రెస్‌లో మహారాణిలా వెలిగిన ఆమె 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. టీడీపీలోని వెన్నుపోటుదారుల వల్ల ఓటమిపాలు అయ్యారు.
రెండుసార్లు మాత్రమే టీడీపీ గెలుపు..
నియోజకవర్గంలో టీడీపీకి ఆదరణ అంతంత మాత్రమే. పార్టీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎనిమిది ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు కేవలం రెండుసార్లు మాత్రమే గెలుపొందారు. ఆరుసార్లు చిత్తుగా ఓడారు. 1985లో ఎన్టీఆర్‌పై సానుభూతితో జయదేవనాయుడు గెలిచారు. తర్వాత 30 ఏళ్లలో ఆరు ఎన్నికలు జరిగితే ఒక్కసారి మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచింది. 1994లో ఎన్టీఆర్ ప్రభంజనంలో టీడీపీ తరుఫున రామ్మూర్తినాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై గెలుపొందారు. తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో టీడీపీని ఆమె చిత్తుగా ఓడించారు.
ప్రభంజనంలా చెవిరెడ్డి
చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రభావం చూపిన నాయకుడిగా డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముద్ర వేసుకున్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరు పొందిన చెవిరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తుడా చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడిగా విలక్షణశైలిలో అభివృద్ధి చేసి చూపించారు. యూత్‌ను ఆకర్షించడంలో ఆయనది ప్రత్యేకశైలి. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేయగా నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా లక్షకు పైగా ఓట్లను సాధించాడు. రాజకీయ ఉద్దండురాలైన గల్లా అరుణకుమారిపై 4,518 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఎమ్మెల్యేగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. యువత, రైతులు, మహిళల కోసం సొంత నిధులతో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో పాటు యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
నానికి తప్పనిఇబ్బందులు
మరోవైపు టీడీపీ అభ్యర్థిగా చిత్తూరులో ఏళ్ల కిత్రమే వ్యాపారపరంగా స్థిరపడిన పులివర్తి వెంకటమణిప్రసాద్(నాని)ని ప్రకటించారు. నియోజకవర్గంలో పరిచయాలు లేకపోవడం, గల్లా అరుణ మంత్రిగా ఉన్న పదేళ్లలో అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేశారు. అలాగే నాయకులు, కార్యకర్తలను నమ్మటం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు.
మొత్తం ఓటర్లు 2,70,495
స్త్రీలు 1,37,018
పురుషులు1,33,434
ఇతరులు 43
చంద్రగిరినియోజకవర్గ సమాచారం అభ్యర్థులు:
1. డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ)
2. పులివర్తి వెంకటమణిప్రసాద్(టీడీపీ)
చంద్రగిరి నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 113 చదరపు కిలోమీటర్లు
తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి, జీడీనెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాలను ఆనుకుని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment