నవ్యపథానికి నవరత్నాలు | Special Story On Navarathnalu Schemes | Sakshi
Sakshi News home page

నవ్యపథానికి నవరత్నాలు

Published Sat, Jun 23 2018 6:42 AM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

Special Story On Navarathnalu Schemes - Sakshi

కొంగొత్త దారులేవో కనిపిస్తున్నాయి. కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జన రథాన్ని ముందుండి నడిపిస్తున్న సారథి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవ్యపథానికి ఊపిరి పోస్తున్నాయి. రోజురోజుకీ రాటుదేలుతున్నాయి. బడుగు జీవుల్లో అణగారిన ఆశలకు కొత్త సత్తువ అందిస్తున్నాయి. నిస్సహాయ మహిళలు మొదలుకుని, నిరాదరణకు గురైన వృద్ధుల వరకూ...లక్ష్మీ కటాక్షం లేని సరస్వతీ బిడ్డల నుంచి...ఆధారం లేని దివ్యాంగుల వరకు భరోసానిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయవచ్చో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసి చూపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా సంక్షేమ పథకాల జాడ లేదు. నిరుపేద, సామాన్య ప్రజలపై కక్ష కట్టినట్టు నీరుగార్చారు. దీంతో అన్ని వర్గాల్లో నిరాశ కమ్ముకొంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌  ఆశయ సాధనతో ముందుకెళ్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలాంటి సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇప్పుడా పథకాలు అమలైతే తమనెంతో ఆదుకుంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. దీంతో నవరత్నాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.

వైఎస్సార్‌ రైతు భరోసా
ఆంధ్రప్రదేశ్‌ మెడలో హరితహారంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా  అన్నపూర్ణగా అందరినీ ఆదుకుంటోంది. అయితే నోటికి ముద్దను అందిస్తున్న అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఎకరాకు రూ. 25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు పెట్టి సాగు చేస్తున్నా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. సరైన మార్కెట్‌ దొరకడం లేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు భారమవుతున్నాయి. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీతో తమ బాధలు తీరుతాయని రైతులు ఆశించారు. కానీ, చంద్రబాబు దా‘రుణం’గా మోసం చేశారు. 2014నాటికి జిల్లాలో ఆరు లక్షల 50వేల మంది రైతులు రూ.13.009కోట్లు రుణంగా తీసుకున్నారు. దీంట్లో రూ.961.93కోట్లు మాత్రమే మాఫీ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రకటించారు. ఖరీఫ్‌ ప్రారంభంలో పెట్టుబడి కోసం వెతుక్కొనే అవసరం లేకుండా ఏటా మే నెలలో నాలుగేళ్ల పాటు రూ. 12,500 చొప్పున ఇస్తామన్నారు. అంతేకాకుండా ధరల తగ్గుదల, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులతో రైతు నష్టపోకుండా ఆదుకునేందుకు రూ. మూడు కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.రెండు వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడంతో  రైతన్నలు ఆనందభరితులవుతున్నారు. రాజన్న రాజ్యం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రయోజనం : వైఎస్సార్‌ రైతు భరోసాతో జిల్లాలో 6.50లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

డ్వాక్రా మహిళలకు వైఎస్సార్‌ ఆసరా
‘‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం’’ అంటూ ఎన్నికలప్పుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణమాఫీ సంగతి పక్కనబెట్టి పెట్టుబడి నిధి పేరుతో మహిళల్ని మోసగించారు. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీ భారం అదనంగా పడటంతో డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2014 ఎన్నికల నాటికి జిల్లాలో 89,433 డ్వాక్రా సంఘాలు రూ.1326.47కోట్లు రుణం తీసుకున్నాయి. ఇంతవరకు రూ.573కోట్లు మాత్రమే పెట్టుబడి నిధి కింద డ్వాక్రా మహిళల చేతికందకండా ఖాతాల్లో జమ చేశారు. ఇవి ఖర్చు పెట్టే వీలు లేకుండా ఆంక్షలు పెట్టారు. ఇంకా రూ.823కోట్లు డ్వాక్రా మహిళలకు రావల్సి ఉంది. పెట్టుబడి నిధి కింద వచ్చిన మొత్తం కూడా తీసుకున్న రుణాలకు వడ్డీకే సరిపోలేదు. వీరి కష్టాలకు విముక్తి కలిగించేలా జగన్‌మోహన్‌రెడ్డి  వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రకటించారు. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. దీంతో మహిళలందరూ జగనన్న పాలన కోసం ఆశగా చూస్తున్నారు.
ప్రయోజనం : జిల్లాలో 92457 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇందులో 8.98లక్షల మందికి ఊరట కలుగుతోంది.

పెద్ద కొడుకులా పింఛన్ల పెంపు
ప్రభుత్వం ఇస్తున్న పింఛన్‌ సరిపోవడం లేదు. పింఛను మంజూరులో వివక్ష చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భరోసా ఇచ్చేందుకు నవరత్నాల్లో ‘‘పింఛను పెంపు’’ ఒక అంశంగా చేర్చారు. ఫించను రూ.1000 నుంచి రూ.2000కు పెంచుతామని ప్రకటించారు. ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రయోజనం :  పింఛన్ల పెంపుతో జిల్లాలో ఐదు లక్షల 41వేల 682 మందికిలబ్ధి చేకూరుతుంది.

అమ్మఒడి
పేదరికంతో చాలామంది చదువుకోలేకపోతున్నారు. వీరికోసమని నవరత్నాల్లో ’అమ్మఒడి’ పథకాన్ని చేర్చారు. ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు నెలకు రూ.వెయ్యి, ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు రూ.1500, ఇంటర్‌మీడియట్‌ చదువుకు రూ.రెండు వేలు చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు.

ప్రయోజనం : అమ్మఒడితో జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మందికి, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న మరో మూడు లక్షల మందికి, ఇంటర్‌ చదువుతున్న లక్షా 50వేల మంది విద్యార్థులకు భరోసా లభిస్తుంది.

పేదలందరికీ ఇళ్లు
వైఎస్సార్‌ హయాంలో సొంత గూడు లేనివారందరికీ పక్కా ఇళ్లు ఇచ్చారు. స్థలాలు కూడా సమకూర్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చారు. చంద్రబాబు సర్కారు ప్రకటనలతో సరిపుచ్చేసింది. పేదలకు పక్కా ఇల్లును కలగా మార్చేసింది. ఈ నేపథ్యంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్న హామీకి నవరత్నాల్లో చోటు కల్పించారు. ఇల్లు ఇచ్చిన రోజునే అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌  చేయిస్తామని, డబ్బు అవసరమైతే పావలావడ్డీకే ఇంటి తనఖాపై రుణం ఇస్తామని తెలిపారు.
ప్రయోజనం : జిల్లాలో ఇళ్లు లేని సుమారు లక్షా 50వేల మందికి లబ్ధి చేకూరనుంది.

ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం
పేదలు కార్పొరేట్‌ వైద్యం అందించాలని మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో వేలాది మందికి ప్రాణం పోశారు. ఈ పథకానికి చంద్రబాబు తూట్లు పొడిచారు. తగిన నిధులు మంజూరు చేయకుండా నిరుపేద రోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఆరోగ్య శ్రీలో ఆంక్షలు పెట్టి అనేక వ్యాధులను తప్పించడంతో మెరుగైన వైద్యం చేయించుకోలేకపోతున్నారు. అప్పులు చేసి క్పారేట్‌ వైద్యం చేయించుకోవల్సిన పరిస్థితి రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చూసి చలించిపోయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నవరత్నాల్లో ఆరోగ్యశ్రీకి ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్‌లో పూర్తిస్థాయిలో నిధులిచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీకి పూర్వవైభవం తీసుకొస్తానని భరోసా కల్పించారు.  కిడ్నీ, తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పింఛను కల్పిస్తామన్నారు.

ప్రయోజనం  : జిల్లాలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న 12,44,052మందికి మేలు జరగనుంది.

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు జీవం
నిరుపేదలు కూడా ఇంజనీర్లు అవ్వాలని..వైద్యులు కావాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేసి, వేలాది మంది నిరుపేద విద్యార్థులు ఇంజనీర్లు, వైద్యులుగా తీర్చిదిద్దారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు ఈ పథకాన్ని నీరుగార్చాయి. చంద్రబాబు వచ్చాక ఆంక్షలు పెట్టి భారీగా కోత పెట్టారు. విద్యార్థులు ఉన్నత చదువులు సాగించలేకపోతున్నారు. కళాశాలల్లో చేరినా తగిన సదుపాయాల్లేక ఉన్నత విద్య ఆశను అర్ధాంతరంగా చిదిమేసుకుంటున్నారు. విద్యార్థుల ఇబ్బందులపై స్పష్టమైన అవగాహన ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి  మళ్లీ జీవం పోస్తానని ప్రకటించారు. వైద్య విద్య, ఇంజినీరింగ్, డిగ్రీ తదితర కోర్సులు చదివే విద్యార్థులందరికీ అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ^è దువుకయ్యే ఖర్చు భరించడంతో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20వేలు అందజేస్తామని ప్రకటించారు.

ప్రయోజనం : జిల్లాలో సుమారు లక్షా 50వేల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

జలయజ్ఞానికి చేయూత
రైతులకు సాగునీరు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జల యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారు. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వచ్చాక ఆ ప్రాజెక్టులకు అంచనాలు పెరగడం తప్ప పూర్తి కావడం లేదు. వైఎస్సార్‌ పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మధ్యలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే చొరవ చూపడం లేదు.ఈ నేపథ్యంలో మహానేత తలపెట్టిన జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని నవరత్నాల్లో భాగంగా ప్రకటించారు.

ప్రయోజనం : ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కాలువల ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ. 3,361 కోట్లు కేటాయించారు. జిల్లాకు రూ.1,679.24 కోట్లు కేటాయించారు. వైఎస్సార్‌ ఉండగా రూ.639.92 కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారు కాని చోట కాలువలు అధ్వానంగా ఉన్నాయని, 2009లో రూ.9.01 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. బాబు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో డెల్టా ఆధునికీకరణపై శీతకన్ను వేశారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు సుమారు రూ.350 కోట్లు కాగా, దీనిలో 70 శాతం మాత్రమే అంటే రూ.245 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. ముసురుమిల్లి ప్రాజెక్టును 2007లో దివంగత నేత వైఎస్సార్‌ జలయజ్ఞంలో నిధులు కేటాయించారు. దీని తొలి అంచనా రూ.207 కోట్లు. ఇప్పటి వరకు రూ.54 కోట్లు ఖర్చుపెట్టారు. దీనిలో రూ.50 కోట్లు వైఎస్సార్‌ హయాంలోనే ఖర్చుపెట్టారు. నాలుగేళ్లలో చంద్రబాబు రూ.నాలుగు కోట్లు మంజూరు చేశారు. ఇంకా 15 శాతం పనులు చేయాల్సి ఉంది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే వీటన్నింటికీ మోక్షం కలగనుంది.

 దశల వారీగా మద్య నిషేధం
సంపాదించే వ్యక్తి మద్యానికి అలవాటు పడితే ఆరోగ్యంపైనే కాకుండా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతోంది. కాపురాలను కూల్చేస్తుంది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనికి చెక్‌ పెట్టేందుకు మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. మద్యం అమ్మకాలను ఆదాయ వనరులుగా చూస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆలోచనకు భిన్నంగా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని భరోసానిచ్చారు.

ప్రయోజనం :  వేలాది కుటుంబాలకు మేలు చేయనుంది. కాపురాలను నిలబెట్టనుంది. జిల్లాలో 538 దుకాణాలు, 44 రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిన్నింటి ద్వారా రోజుకి రూ. ఐదు కోట్ల విక్రయాలు జరుగుతున్నాయి. దశల వారీ మద్య నిషేధం వలన ఈ సొమ్ము అంతా ఆదా అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement