సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ’దేశంలోని అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే దేశం రూపురేఖలు మారుతాయి. కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని తిరుపతిలో మొక్కుకున్నా. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ఆయనదే ముఖ్యపాత్ర. సార్వత్రిక ఎన్నికల్లో 16 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటే మరింత బలం చేకూరుతుంది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక సైనికుడిగా పనిచేస్తా. ఆబ్కారీ శాఖను నాకు అప్పజెప్పినందుకు నా బాధ్యత పెరిగింది. రాష్ట్రానికి ఆదాయం తెచ్చే ఆబ్కారీ శాఖను నాకు ఇచ్చిన కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క శాఖపై పట్టు పెంచుకుని ముందుకు వెళతా. ఇప్పటికే రాష్ట్రంలో అక్రమ మద్యమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు మరింత కష్టపడి పనిచేస్తా. అలాగే గుడుంబాని నిషేధించడంతో దాన్ని తయారు చేస్తున్నవారికి ఉపాధి కూడా కల్పిస్తాం. కల్లును ఆల్కహాల్‌గా కాకుండా మంచి పానీయంగా చూడాలి. గతంలో నిరాను ఉత్పత్తి చేసేవారు. అయితే మరిన్న చెట్లను పెంచి నిరా ఉత్పత్తిని పెంచుతాం.
Comments
Please login to add a commentAdd a comment