సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన చాలా అశాస్త్రీయంగా జరిగిందని, రాష్ట్రానికి గుండె కాయలాంటి రాజధాని లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏపీ విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు.
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆందోళనలో పాల్గొన్న మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ..విభజన సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రాజకీయ ఉద్దేశ్యాలతోనే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఉంటే విద్యార్థుల జీవితాలు ఎంతో బాగుపడేవని, ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు.
పార్లమెంటులో ఎన్ని మొత్తుకున్నా పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించారు. 2019లో జరుగబోయే ఎన్నికల సమయంలో కేంద్రంలో జరిగే రాజకీయ సమీకరణాల్లో మన రాష్ట్ర ఎంపీల అవసరం ఎంతో ఉంటుందని, అప్పుడైనా ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హామీలు అమలుచేయకపోతే జనం క్షమించరని, 2019 ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కెవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ..ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చాలని కోరారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై రూల్ 184 కింద పార్లమెంటులో నోటీసు ఇస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment