
పాయకపాడులో ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్న జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సర్కారీ స్కూళ్లకు చెదలు పట్టించారన్నా.. అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.. సరిపడా తరగతి గదుల్లేవు.. మరుగుదొడ్లు లేవు.. చివరికి తగినంత మంది ఉపాధ్యాయులూ లేరంటూ విద్యార్థులు, చదివిన వాళ్లకు ఉద్యోగాల్లేవు.. గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలూ లేవంటూ యువతీయువకులు, పొట్టకూటి కోసం పిల్లలు వలసలు వెళ్లాల్సి వస్తోందంటూ తల్లిదండ్రులు, జన్మభూమి కమిటీల ఆగడాలు మితిమీరిపోయాయని అవ్వాతాతలు, స్టైఫండ్ ఇప్పించాలని ఆర్‌ఎంపీలు, పీఎంపీలు.. ఇలా వివిధ వర్గాల వారు జననేత ఎదుట తమ కష్టాలు చెప్పుకొన్నారు. అధికారంలోకి వచ్చాక తమ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 294వ రోజు గురువారం విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం చప్పబుచ్చమ్మపేట శివారు నుంచి పాయకపాడు వరకు సాగింది. ఆనాడు తమ జీవితాల్లో వెలుగులు నింపిన వైఎస్ పాలనను గుర్తుచేసుకున్న పలువురు కొండ ప్రాంతాల ప్రజలు.. అలాంటి సంక్షేమ పాలన అందించేందుకు మీరు అధికారంలోకి రావాలయ్యా.. అంటూ రాజన్న బిడ్డను ఆశీర్వదించారు.
సర్కారీ స్కూళ్ల తీరుకు అద్దంపట్టిన చిన్నారుల లేఖ..
‘అన్నా.. మాది మక్కువ. మేం చదువుతున్న జిల్లా పరిషత్ పాఠశాల తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. వర్షం వస్తే స్కూల్‌కు సెలవు ఇస్తున్నారు. సరిపడా తరగతి గదులు, టీచర్లు లేరు. మరుగుదొడ్లు కూడా లేవు. చాలా స్కూళ్ల పరిస్థితీ ఇలానే ఉంది. ఆగస్టు 15న మా స్కూలుకు వచ్చిన ప్రతి నాయకుడికీ మా స్కూలు దుస్థితిని చెబుతున్నాం. వారు పట్టించుకోవడం లేదు. మీరు సీఎం కాగానే పాఠశాలలపై దృష్టిపెట్టాలి’ అని రాసిన లేఖను మక్కువ సమీపంలో విద్యార్థులు జగన్‌కు అందించారు. లేఖను చదివిన జగన్ విద్యార్థులనడిగి వివరాలు తెలుసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా సంస్కరిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఫిలడెల్ఫియా ఆస్పత్రి వైద్య బృందం వైఎస్ జగన్‌ను కలిసి ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న తీరును ప్రశంసించింది.
పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలెలా వస్తాయన్నా!
సాలూరు నియోజకవర్గం సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఓ వందమందికి ఉద్యోగాలు, ఉపాధి చూపించే పరిశ్రమ ఒక్కటీ రాలేదని పలువురు మహిళలు జగన్‌కు విన్నవించారు. పారిశ్రామికాభివృద్ధి లేకుండా ఉద్యోగాలు ఎలా వస్తాయన్నా.. అంటూ వాపోయారు. మీరొచ్చాక ఉపాధి చూపించే పరిశ్రమలను స్థాపించాలన్నా.. అంటూ మక్కువ గ్రామానికి చెందిన పప్పుల రాధా, సరస్వతి తదితరులు కోరారు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇస్తున్నారో అర్థం కావడం లేదని బీటెక్ చదివిన ఎన్.ప్రమీల జననేతకు ఫిర్యాదు చేసింది. ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదని కొందరు, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని జన్మభూమి కమిటీల వాళ్లు పింఛన్లు తీసేశారని గిరిజన గ్రామాల అవ్వాతాతలు, తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్‌ఎంలు.. ఇలా పలు వర్గాల ప్రజలు వైఎస్ జగన్‌కు తమ కష్టాలు చెప్పుకొన్నారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ప్రతిక్షణం ప్రజల కోసం పరితపించే వ్యక్తిపై ఈ కుట్రలేంటి?
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంతో విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం ఉలిక్కిపడింది. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో టీవీలు పెట్టుకుని అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నం చేశారు. పొలాల్లో ఉన్న వారు తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి జననేత ఆరోగ్యంపై ఆరా తీశారు. హత్యాయత్నం జరిగిన తీరుపై తల్లడిల్లిపోయారు. అప్పటి వరకు తమ మధ్యనే ఉండి వెళ్లిన జగన్‌పై ఇంత దారుణమా? అంటూ విస్తుపోయారు. ప్రతిక్షణం ప్రజల కోసమే పరితపిస్తున్న వ్యక్తిపై ఈ కుట్రలేంటంటూ కన్నీళ్లుపెట్టుకున్నారు. ఇక్కడే ఇంకో గంట గడిపినా ఈ ఆపద తప్పేదని.. దేవుడి దయ వల్ల బిడ్డ బతికి బయటపడ్డాడంటూ దండాలు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment