బోస్‌తో మాట్లాడుతున్న మంత్రి అమరనాథరెడ్డి
చిత్తూరు ,పలమనేరు : ఇప్పుడొచ్చి ఎవరెన్ని చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని... రెండు రోజుల్లో తన వర్గీయులతో, కార్యకర్తలతో సమావేశమై వారి నిర్ణయాన్ని శిరసావహిస్తానని మంత్రి అమరనాథరెడ్డికి సుభాష్ చంద్రబోస్ తేల్చిచెప్పారు. టీడీపీలో తనకు సముచిత స్థానం లేదంటూ రెండు రోజుల క్రితం ఆయన ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కోశాధికారి పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయానికల్లా మంత్రి అమరనాథరెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేతలు బోస్ స్వగృహానికి వెళ్లారు. ఆయన్ను తిరిగి పార్టీలోకి రావాలని బుజ్జగింపులు జరిపారు. ఈ సందర్బంగా బోస్ మాట్లాడుతూ ‘మీరంతా మా ఇంటికి వచ్చినందుకు సంతోషం..
అయితే నేను ఓ నిర్ణయం తీసుకున్నా.. దానికే కట్టుబడి ఉంటా..’ అని తేల్చి చెప్పారు. పార్టీలో తనకు గానీ తనను నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదని ముఖ్యమంత్రితో విన్నవించేందుకు చాలాసార్లు ప్రయత్నించానన్నారు. అయితే ఆయన అపాయింట్‌మెంటు కూడా ఇవ్వనప్పుడు ఆ పార్టీలో తనకు ఏ స్థానం ఉందో అర్థమైందన్నారు. ‘ఇన్నాళ్లు మీకంతా గుర్తుకురాని నేను.. ఇప్పుడు మాత్రం గుర్తుకొచ్చానా ?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రితో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తాం’ అని మంత్రి చెప్పారు. ‘అదంతా కాదు.. నన్ను నమ్ముకున్న వారు ఏ దారిలో వెళ్లమంటే ఆ దారిలో పోతాను గానీ మళ్లీ యూటర్న్ తీసుకోవడం కుదరదు’ అని బోస్ తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment