టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే | Subramanian Swamy Comments On Chandrababu and TTD | Sakshi
Sakshi News home page

టీటీడీపై దుష్ప్రచారం బాబు కుట్రే

Published Wed, May 27 2020 4:23 AM | Last Updated on Wed, May 27 2020 8:47 AM

Subramanian Swamy Comments On Chandrababu and TTD - Sakshi

ఈ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టీటీడీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టీటీడీ కమిటీలో ఏపీ బీజేపీ నేత భాను ప్రకాశ్‌రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాట మార్చి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.

51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని 2016, జనవరి 30న సమావేశమైన టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఆ సమయంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తన మనుషులతో నియమించిన టీటీడీ పాలకమండలే ఆ 51 ఆస్తులను విక్రయించాలని నిర్ణయించింది. అంటే టీటీడీ ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్నదే. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కూడా. 

చంద్రబాబు కుట్రలకు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. టీటీడీ ఆస్తుల విక్రయానికి వ్యతిరేకంగా ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేస్తుండటం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో టీటీడీ ఆస్తుల విక్రయానికి అనుకూలంగా వ్యవహరించినందుకు వీరంతా ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. అప్పుడు తప్పు చేశాను.. ఇప్పుడు అబద్ధాలు చెప్పానని చంద్రబాబు కూడా అంగీకరించాలి. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.
– సుబ్రహ్మణ్యస్వామి, బీజేపీ నేత 

సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందన్న దుష్ప్రచారం అంతా చంద్రబాబు కుట్రే. వాస్తవానికి టీటీడీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటి టీటీడీ కమిటీలో ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాటమార్చి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు’.. అని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కుండబద్దలుగొట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు.. ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోసం, కుట్ర అన్నవి చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటేనని ‘సాక్షి’కి మంగళవారం ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మండిపడ్డారు.

టీటీడీ ఆస్తులను వేలం వేయాలని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించిన విషయాన్ని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. చంద్రబాబును ప్రజలు నిలదీయాలని ఆయన సూచించారు. తాను చేసిన మోసానికి చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుబ్రహ్మణ్యస్వామి డిమాండ్‌ చేశారు. అలాగే, టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేయడాన్ని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి స్వాగతించారు. నిజాయితీ, నిబద్ధత ఉన్న అరుదైన రాజకీయ నేత వైఎస్‌ జగన్‌ అని ఆయన ప్రశంసించారు. టీటీడీ ఆస్తుల వేలంపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం.. చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన వాస్తవాలపై సుబ్రహ్మణ్యస్వామి తన ఇంటర్వ్యూలో అంశాల వారీగా చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..

వేలం వేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే
టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిర్ణయించారు. ఏపీలోనూ.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న టీటీడీకి చెందిన 84 ఆస్తులను విక్రయించాలని 2015లోనే టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఇందుకోసం 2015, జూలై 28న ఓ కమిటీని నియమించింది. అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి కూడా ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆ కమిటీ పలుమార్లు భేటీ అయి ఆ ఆస్తులను కాపాడలేమని, విక్రయించాలని సూచించింది. ఆ కమిటీ నివేదికలో భానుప్రకాశ్‌రెడ్డి కూడా సంతకం చేశారు. 2016, జనవరి 29న చివరిసారిగా ఆ కమిటీ సమావేశమై 53 ఆస్తులను విక్రయించాలని సూచించింది. అనంతరం 2016, జనవరి 30న సమావేశమైన టీటీడీ పాలక మండలి.. 51 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ నేత మాణిక్యాలరావే రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు.

ఏపీకి ద్రోహం చేస్తున్న చంద్రబాబు
అసలు టీటీడీ ఆస్తులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వేలం వేస్తోందంటూ టీడీపీ కృత్రిమ వివాదం సృష్టించింది. ఇది కచ్చితంగా చంద్రబాబు కుట్రే. నా దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయి. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం టీటీడీ ఆస్తులను వేలం వేస్తోందని చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే కాదు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు. కుట్రలు చేయడం చంద్రబాబు నైజం. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఆయన కుట్రలు పన్నుతున్నారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌ను చేయగానే ఆయన క్రిస్టియన్‌ అని దుష్ప్రచారం చేశారు. కానీ, వైవీ హిందూ ధార్మిక వాది. నాకు బాగా తెలుసు. 

కొందరు ఏపీ బీజేపీ నేతల తీరు దురదృష్టకరం
చంద్రబాబు కుట్రలకు ఏపీలో కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలుకుతుండటం దురదృష్టకరం. అప్పట్లో టీటీడీ ఆస్తుల వేలాన్ని సమర్థించిన ఏపీ బీజేపీ నేతలు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఇళ్లల్లో ఉపవాస దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. వీరంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ నేతలు తెలుసుకోవాలి. అక్కడ కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అన్నింటికీ ముఖ్యమంత్రే తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు. ఇది బీజేపీ సిద్ధాంతానికి విరుద్ధమని తెలీదా. ఏపీ బీజేపీ నేతలు ఉత్తరాఖండ్‌ వెళ్లి ఉపవాస దీక్షలుచేయాలి. 

సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు 
టీటీడీ ఆస్తులను వేలం వేయాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిలుపుదల చేయడం సంతోషకరం. అందుకు ఆయనకు ధన్యవాదాలు. వైఎస్‌ జగన్‌ అరుదైన రాజకీయ నేత. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి. రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధత ఉన్న నేత. మంచి నాయకుడు మాత్రమే కాదు మంచి వ్యక్తి కూడా. టీటీడీ ఆస్తులను వేలం వేయాలని చంద్రబాబు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఆధారాలను ఆయన ప్రజల ముందుంచాలి. అంతేకాదు.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేయాలి. టీటీడీ ఆస్తుల అంశంపై సలహాలు, సూచనలివ్వాలని హిందూ ధార్మిక సంస్థలు, మత పెద్దలు, భక్తులను జగన్‌ కోరడం సరైన చర్య. ప్రభుత్వానికి నేనూ సలహాలిస్తాను. అలాగే.. అందరూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి.  

చంద్రబాబును ప్రజలు నిలదీయాలి
రాజకీయ ప్రయోజనాల కోసం జగన్‌ ప్రభుత్వంపై కుట్రలకు పాల్పడుతూ దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలి. టీటీడీ ఆస్తులను విక్రయించాలని ఎందుకు తీర్మానించారో చెప్పాలని కూడా ప్రశ్నించాలి. భానుప్రకాశ్‌రెడ్డినీ నిలదీయాలి. చంద్రబాబు వాస్తవాన్ని అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. విద్వేషాలు రెచ్చగొట్టే యత్నాలను మానుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement