
విజయవాడ సిటీ: రాజకీయ విలువల గురించి చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని, ఆయన్నుంచి విలువలు నేర్చుకోవాల్సిన గతి తమ పార్టీకి పట్టలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. చంద్రబాబుకు నిజంగా రాజకీయ విలువలుంటే.. వైఎస్సార్‌సీపీ నుంచి దొంగిలించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేసి తిరిగి గెలిపించుకోవాలన్నారు. విజయవాడ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తీవ్రత తగ్గించే చర్యలకు సీఎం పాల్పడుతున్నారని మండిపడ్డారు. హోదా ఉద్యమంలో టీడీపీ పాత్ర, కుట్రపూరిత శైలి ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
ఒకవైపు ప్రత్యేక హోదా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీతో అంటకాగి, ఇప్పుడు చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం గర్హనీయమన్నారు. ‘ఆర్థిక నేరగాళ్లంటూ పదేపదే ఆరోపిస్తున్న సీఎంకు తన వెంటే ఉండే సుజనాచౌదరి బ్యాంకులను మోసగించిన విషయం కనిపించలేదా? వాకాటి నారాయణరెడ్డి, పీలా గోవింద్, ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్ వంటివారు నేరస్తులుగా కనిపించట్లేదా? అని ప్రశ్నించారు.‘‘నీ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రాజకీయ శూన్యత కల్పించిందెవరు? ఎన్టీఆర్ కొడుకు నందమూరి హరికృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ?’’ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు.
టీడీపీని నారావారి పల్లెలో స్థాపించారా? లోకేష్ టీడీపీ రాజకీయ వారసత్వ నాయకుడిగా ఎలా మారాడు? టీడీపీలో నందమూరి వారసుల పాత్ర ఏమిటో వంటి ప్రశ్నలకు జవాబులు చెబితే చంద్రబాబు రాజకీయ విలువలు తెలుసుకుని తాము నేర్చుకుంటామన్నారు. చంద్రబాబుకు నిజంగా విలువలనేవి ఉంటే నారా వారి టీడీపీ అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment