
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఏది అసలు వార్తో ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. పాత ఫొటోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెట్టి అసలు వార్తల్లా భ్రమింప చేస్తున్నారు. ఈ కోవలోకే వస్తుంది గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఓటేసిన వార్త. రెండో దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో గురువారం పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఓటు వేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్త వచ్చింది. తమిళనాడుకు చెందిన సుందర్ పిచయ్ ఓటు కోసమే పని గట్టుకుని భారతదేశం వచ్చారని, ఓటు వేసి వెళ్లిపోయారని ఆ వార్త సారాంశం. ఓటు వేయడానికి వస్తున్న సుందర్ పిచయ్ అంటూ ఫొటో కూడా పెట్టారు. అయితే, నిజానికి సుందర్ పిచయ్ ఓటు వేయలేదు.
అమెరికాలో ఉంటున్న ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. అంటే ఆయన భారత పౌరుడిగా, అమెరికా పౌరుడిగా కూడా చెలామణి అవుతున్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి సుందర్ పిచయ్ ఓటు వేశారనడం నిజం కాదు. ఈ వార్తతో పాటు పెట్టిన ఫొటో రెండేళ్ల కిందటిది. 2017లో భారత దేశం వచ్చిన సుందర్ తాను చదువుకున్న ఖరగ్‌పూర్ ఐఐటీకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోను ఇప్పటి వార్తతో కలిపి పెట్టేశారు. దాన్ని చూసిన వారు నిజంగా పిచయ్ ఓటు వేయడానికి వచ్చారని నమ్మేశారు.
Comments
Please login to add a commentAdd a comment