
కర్ణాటకం : ఓటింగ్ జరపాలని ఆదేశించలేమన్న సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో కర్ణాటక జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. సభలో చర్చ జరుగుతుండగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో బలపరీక్షపై ఓటింగ్ చేపడతారని ఆశిస్తున్నామని, బలపరీక్ష జరపకపోతే రేపు పిటిషన్‌ను విచారిస్తామని పేర్కొంది.
వెంటనే ఓటింగ్ జరపాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. కాగా స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే బలపరీక్షపై ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నారని రెబెల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు.
ఇక సిద్ధరామయ్య తమపై సభలో పిటిషన్ ఇచ్చిన కాపీలు తమకు ఇంకా అందలేదని స్పీకర్‌కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహరం తేలేవరకూ బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బలపరీక్ష చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనున్న దృష్ట్యా విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్ణయాన్ని తీర్పు ప్రభావితం చేయనుందని భావిస్తున్నారు.