సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఊహించని మలుపులతో నెల రోజులుగా ‘మహా’ పొలిటికల్ ఎపిసోడ్ థిల్లర్ సినిమాను తలపించింది. అపర చాణక్యుడు శరద్ పవార్ సెంటిమెంట్‌తో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో మహా వికాస్ కూటమి ప్రభుత్వం కొలువుతీరబోతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో శరద్ పవార్‌ది ప్రధాన పాత్ర అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ‘మహా’ పర్వంలో పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించి తండ్రి తనయ అనిపించుకున్నారు.
ఎన్సీపీని చీల్చడానికి సోదరుడు అజిత్ పవార్ ప్రయత్నించినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజకీయాల కంటే బంధాలే ముఖ్యమని నచ్చజెప్పి అజిత్‌ను తిరిగి పార్టీలోకి తీసుకురావడంతో సుప్రియ చూపిన చాకచాక్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అంతేకాదు తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడంలోనూ ఆమె ప్రదర్శించిన హుందాతనం ప్రశంసనీయం. ఎమ్మెల్యేలందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ఐక్యతను నూరిపోశారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రత్యర్థుల కుట్రలో పడకుండా తండ్రి పవార్‌తో ఆమె కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉండి మంత్రాంగం నడిపించారు.
ఇక బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంగా సుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీలోకి తిరిగి వచ్చిన సోదరుడు అజిత్ పవార్‌ను ఆత్మీయ ఆలింగం చేసుకుని స్వాగతం పలికారు. అసెంబ్లీకి వచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యేందరినీ దగ్గరుండి మరీ స్వాగతించారు. కరచాలనం చేసి, వెన్ను తడుతూ శాసనసభ్యులందరినీ ప్రోత్సహించారు. తమ పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా అంతే అభిమానంతో స్వాగతించి అందరి మన్ననలను చూరగొన్నారు. లోక్‌సభ సభ్యురాలిగా జాతీయ రాజకీయాల్లో రాణిస్తూనే మహారాష్ట్రలో తనదైన ముద్ర వేసిన సుప్రియ.. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటారని ఆమెను దగ్గరగా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆమె పాత్ర ఎనలేనిదని ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: శరద్ పవార్ క్షమించేశారు!!)
Comments
Please login to add a commentAdd a comment