
మహబూబాబాద్: జీఎస్టీ, నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో లచేపట్టిన పోరుబాట యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం రాత్రి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జీఎస్టీతో చిరువ్యాపారులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి లేని పార్టీ బీజేపీ అని చెప్పుకొంటున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జైషా రూ.50 వేలతో కంపెనీ పెట్టి రూ.80 వేల కోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. చిట్‌ఫండ్ పేరుతో కోట్లాది రూపాయలు దిగమింగిన శారద చిట్‌ఫండ్స్‌కు చెందిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకున్నారని, తప్పుడు కేసులు పెట్టి కూడా కొంతమందిని చేర్చుకుంటున్నారని అన్నారు.
కేంద్రంతో కొంతమంది సీఎంలు కూడా లాలూచీ పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నరేళ్లలో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిందని, మతం పేరుతో విభజన చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయన్నారు. మైనార్టీలపై దాడులు, దళితులపై అత్యాచారాలు జరిగాయన్నారు. మత, కుల వివక్ష, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, బాల మల్లేష్, పి.పద్మ, ఎం.ఆదిరెడ్డి, బి.విజయ్‌సారథి, బి.అజయ్, పెరుగు కుమార్, రాములు, అంజయ్య, లక్ష్మినారాయణ, నర్సింహులు, శివరామకృష్ణ, పాండురంగాచారి, శ్రావణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment