
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ఐక్యవేదికను విచ్ఛిన్నం చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేసీఆర్ తన పాత్ర పోషిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీకి బీ–టీమ్‌గా పనిచేసేందుకే ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నారన్నారు. కేసీఆర్ చేపట్టిన కొత్త యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించాక అక్కడి సీఎంలతో చేసిన చర్చల వివరాలు తెలియజేసేందుకే ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కాబోతున్నారని ఆరోపించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్రసమితి సమావేశాల సందర్భంగా సురవరం రాజకీయ నివేదికను సమర్పించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు మోదీ అపాయింట్‌మెంట్ కోసం వారాల తరబడి వేచిచూసే పరిస్థితి ఉండగా, తాను ఫలానా తేదీ ఢిల్లీకి వస్తున్నానని చెప్పగానే ప్రధాని అపాయింట్‌మెంట్ ఫిక్స్ అవుతోందన్నారు. ఈ పరిణామాలను బట్టి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఎవరికోసమో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. కొంతకాలంగా దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు, మేధావుల హత్యలు వంటి అనేక తీవ్రమైన ఘటనలు చోటుచేసుకున్నా కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదని దీనిని బట్టి బీజేపీతో ఉన్న సంబంధాలు స్పష్టమవుతున్నాయన్నారు.
రైతుబంధు, ఇతర పథకాలతోనే..
తెలంగాణలో టీఆర్‌ఎస్ అనూహ్య విజయానికి పోలింగ్‌కు రెండురోజుల ముందు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.4 వేలు చొప్పున జమకావడం కారణమని, మొత్తంగా 54 లక్షల మంది రైతులకు లబ్ది జరిగిందని, గొర్రెల పెంపకం, పెన్షన్ల పెంపు వంటి సామాజిక సంక్షేమ పథకాలు గెలిపించాయని సురవరం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చంద్రబాబు చేరడాన్ని కేసీఆర్ తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ప్రయోజనం పొందారన్నారు. పౌరహక్కుల హరింపు, నియంతృత్వ విధానాలు, వాస్తు ప్రకారం పాలన చేసి నవ్వులపాలు కావడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వేల కోట్ల దుర్వినియోగం వంటి విషయాల్లో టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్ పాలనపై తాము చేసిన విమర్శలు సరైనవేనని స్పష్టం చేశారు. సహేతుకత, ప్రజల చైతన్య స్థాయిని పెంచడంలో విఫలమయ్యామని చెప్పారు. అంతులేని డబ్బు ప్రవాహం మధ్య ఎన్నికలు జరిగాయని, రూ.143 కోట్ల ధనాన్ని ఈసీ స్వాధీనం చేసుకున్నదంటే ఎన్ని కోట్లమేర డబ్బు పంపిణీ అయ్యిందో ఊహించుకోవచ్చునన్నారు. ప్రస్తుత పరిణామాలతో పార్టీ శ్రేణులు నిరాశా, నిస్పృహలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. నూతన శక్తులు ఐక్యమయ్యేలా చేసేందుకు, ప్రజాశ్రేణులను కదిలించేందుకు పార్టీగా సీపీఐ, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment