
సీఎం చంద్రబాబు నివాసం వద్ద అంజిరెడ్డి వ్యతిరేక వర్గం బుధవారం రెండోరోజు ఆందోళనకు దిగింది.
సాక్షి, అమరావతి : టికెట్ల కేటాయింపుల పర్వం ముగిసిపోయి, నామినేషన్ల ప్రక్రియా మొదలైనా టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తగ్గడం లేదు. అసమ్మతి నేతల అనుయాయులు, పార్టీ కార్యకర్తలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు పోరాడైనా తమకు నచ్చని అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని పట్టుదలగా ఉన్నారు. మాచర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న అన్నపురెడ్డి అంజిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం నిరసనకు దిగింది. సీఎం చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ శ్రేణులు బుధవారం రెండోరోజు ఆందోళనకు దిగాయి. అంజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దని కార్యకర్తలు హెచ్చరించారు. తమ నిరసనలను లెక్కచేయకుండా ఆయన నామినేషన్ వేస్తే అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా.. కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన కొమ్మారెడ్డి చలమారెడ్డినే సీటు వరిస్తుందని అందరూ భావించగా.. అంజిరెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు.