పార్లమెంట్‌ సాక్షిగా.. | TDP and BJP Political Drama was Revealed as a witness of Parliament | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సాక్షిగా..

Published Wed, Jul 18 2018 3:34 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

TDP and BJP Political Drama was Revealed as a witness of Parliament - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నుంచి, ఎన్డీఏ నుంచి తాము వైదొలిగామని టీడీపీ చెబుతున్నా.. వారి మధ్య లోపాయికారీ బంధం ఇంకా బలంగా కొనసాగుతోందని తాజాగా మరో ఉదంతం స్పష్టం చేసింది. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని కోరేందుకు  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అన్ని పక్షాలతో సమావేశం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే మంగళవారం ఉదయం పార్లమెంట్‌ భవనంలో జరిగిన సమావేశానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ భేటీ సాక్షిగా బీజేపీ, టీడీపీల స్నేహబంధం మరోసారి బట్టబయలైంది. తమ పార్టీ టిక్కెట్‌పై గెలుపొందిన ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరినందున ఆమెపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు గతంలో ఇచ్చిన లేఖ పెండింగ్‌లో ఉండగానే.. ఆమెను వైఎస్సార్‌ సీపీ ప్రతినిధిగా పరిగణిస్తూ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ ఆహ్వానం పంపారు.

ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ పక్ష నేతగా హాజరైన ఎంపీ వి.విజయసాయిరెడ్డి వివిధ పక్షాల నేతల స్థానాల్లో ఆయా సభ్యుల పేర్లతో పాటు బుట్టా రేణుక నామ ఫలకం కూడా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశం ప్రారంభంలోనే దీనిపై మంత్రి అనంతకుమార్‌ను నిలదీశారు. తమ పార్టీ లోక్‌సభ సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసీ పార్టీ ఫిరాయించిన బుట్టా రేణుకను ఎలా పిలిచారని ప్రశ్నించారు. తక్షణం ఆ నామఫలకాన్ని ఉపసంహరించని పక్షంలో సమావేశాన్ని బహిష్కరిస్తానని స్పష్టం చేశారు. అనర్హత పిటిషన్‌ స్పీకర్‌ వద్ద పెండింగ్‌లో ఉందని మంత్రి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా విపక్ష నేతలంతా విజయసాయిరెడ్డిని సమర్థించారు. దీంతో బుట్టా రేణుక నామఫలకాన్ని తొలగించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఆదేశించారు. 

టీడీపీ–బీజేపీ లోపాయికారీ ఒప్పందాలు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించినా బీజేపీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు సభ్యతాన్ని మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్య సప్న మునగంటివార్‌కు ఇవ్వడం, ఇటీవల పోలవరం సందర్శనకు వచ్చిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కారీతో చంద్రబాబు సన్నిహితంగా మసలుకోవడం, నీతి ఆయోగ్‌ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ ఎదుట చంద్రబాబు వంగిపోయి వినయంగా నమస్కరించడం తెలిసిందే. ఇవేవో కాకతాళీయంగా జరిగిన ఘటనలు కావని, రెండు పార్టీల సత్సంబంధాలను ఇది బహిర్గతం చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  

ఎన్నికల భయంతో టీడీపీ డ్రామాలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రానికి ప్రతి అడుగులోనూ సహకరించిన టీడీపీ ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రం బాగుపడుతుందని ప్రకటించడం తెలిసిందే. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు నాలుగేళ్లుగా పార్లమెంట్‌లో ఆందోళన చేయడం, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతూ యువభేరీలు, దీక్షలు, ధర్నాలతో చైతన్యం రగల్చడంతో గత్యంతరం లేక టీడీపీ యూటర్న్‌ తీసుకుంది. నాలుగేళ్ల తరువాత తాపీగా హోదా కావాలంటూ ప్లేటు ఫిరాయించింది. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు సర్కారు లొంగిన వైనాన్ని మరిచిపోయేలా చేసేందుకు పార్లమెంటు బయటా, లోపల నాటకాలు ప్రదర్శించింది.

వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇస్తే టీడీపీ కూడా ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షలు చేస్తారని తెలిసి ఒక్క పూట సభ లోపల, సెంట్రల్‌ హాల్‌లో టీడీపీ ఎంపీలు దీక్ష చేస్తున్నట్టు నటించారు. ఇప్పుడు ఎన్నికల భయంతో కేంద్రంపై అవిశ్వాసం పేరుతో మరో నాటకానికి సిద్ధమయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని రకాలుగా ప్రయత్నించి చివరికి రాజీనామాలకు సైతం వెనుకాడకుండా పదవులను వీడిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలపై దుష్ప్రచారం చేసేందుకు టీడీపీ ఒడిగట్టింది. తెర వెనుక జరుగుతున్న రాజకీయాలు, లోపాయికారీ ఒప్పందాలకు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement