విజయసాయిరెడ్డి
సాక్షి,విశాఖసిటీ/మద్దిలపాలెం: లాలూచీ రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాల్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడిన చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర బంద్ సందర్భంగా మద్దిలపాలెం జంక్షన్‌లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడూతూ కేంద్ర ప్రభుత్వం హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిందంటే.. అందుకు ప్రధాన కారణం చంద్రబాబేనని మండిపడ్డారు. ఏపీకి హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ చాలని గతంలో దుర్మార్గపు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం వల్లే కేంద్రం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల పోరాటంలో భాగంగా పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టగా, దాన్ని చర్చకు రానీయకుండా చేశారని దుయ్యబట్టారు. తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు సమర్పించిన తర్వాత ఏపీలోని 25 మంది ఎంపీలు కలిసికట్టుగా రాజీనామా చేసి ఉన్నట్‌లైతే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదని అభిప్రాయపడ్డారు. మార్చి 2014లో కాంగ్రెస్ పార్టీ కేబినెట్‌లో హోదాపై తీర్మానం చేసిన తర్వాత కూడా చంద్రబాబు నడిపిన లాలూచీ రాజకీయాలవల్లే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. అఖిల పక్షం బంద్ వల్ల ప్రయోజనం లేదంటూ చెత్తగా మాట్లాడటం చంద్రబాబుకు తగదని హితవు పలికారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరు ఎన్ని బంద్‌లు చేశారో గుర్తులేదా అని ప్రశ్నించారు. నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసనలు తెలిపితే ఏం సాధిస్తామని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీడీపీ ద్వంద్వవైఖరిని విడనాడాలని సూచించారు.
స్వప్రయోజనాలకు పోలవరం తాకట్టు
అవినీతిని, మద్యం దుకాణాలను ప్రోత్సహించడంతో పాటు రాజధాని పేరుతో కుంభకోణాలకు పాల్పడటం, పోలవరం ప్రాజెక్టును స్వప్రయోజనాలకు తాకట్టు పెట్టడంలో సిద్ధహస్తులుగా మారిపోయిన చంద్రబాబు బంద్‌ను వ్యతిరేకించడం సరికాదన్నారు. చంద్రబాబు వైఖరిని చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనిచేస్తున్న ఇలాంటి వ్యక్తికి బతికుండే హక్కు లేదంటూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ న్యాయ దండం పట్టుకొని తీర్పునిస్తారేమోనన్న భావన కలుగుతోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన బకాసురుడిలా మారిపోయారని దుయ్యబట్టారు. ఈయన ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్న విషయం ప్రజలు అవగాహన చేసుకున్నారన్నారు. 5 కోట్ల ఆంధ్రుల అభిప్రాయాల్ని ప్రతిబింబించేలా అఖిలపక్షం ఉద్యమిస్తోందని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పాఠ్యాంశాల నుంచి హిస్టరీని తొలగించాలని ఉత్తర్వులు సైతం జారీ చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారామ్‌తో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment