
రామకృష్ణారెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు
మంత్రాలయం రూరల్ : మండలంలో తమ్ముళ్ల వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ప్రత్యేక హోదా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా నియోజకవర్గం కేంద్రంలో పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో దీక్ష ఏర్పాటు చేశారు. దీక్ష ప్రారంభమైన అరగంటకే టీడీపీ మండల యువ నాయకులు ఎన్.రామకృష్ణారెడ్డి మాధవరం నుంచి మంత్రాలయం వరకు తమ అనుచరులతో ఆటో, బైక్ ర్యాలీ నిర్వహించారు. రాఘవేంద్రస్వామి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తిరుగు ప్రయాణంలో తన కార్యకర్తలతో కలిసి వస్తుండగా శ్రీమఠం సమీపంలో మంత్రాలయం, మాధవరం ఎస్‌ఐలు శ్రీనివాసనాయక్, రాజారెడ్డి రామకృష్ణారెడ్డి అడ్డుకొని ఒక్కే చోట రెండు కార్యక్రమాలు చేయరాదని కోరారు.
అనంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి బీసీల ఎదుగుదలను చూసి ఓర్వలేకనే పోలీసులను పెట్టుకుని కార్యక్రమాలు జరపకుండా అడ్డు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో తిక్కారెడ్డి ఎమ్మెల్యేగా కాదు కదా! వార్డు సభ్యులుగా కూడా గెలువలేరన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు పన్నగవెంకటేష్, పట్టణ అధ్యక్షులు కుమార్, విద్యా కమిటీ చైర్మన్ నరసింహులు, మేకల నరసింహులు, లక్ష్మన్న, గోపాల్‌రెడ్డి, చావిడి వెంకటష్, బూదూరు మల్లికార్జున రెడ్డి, రామాంజిని తదితరులు పాల్గొన్నారు.