
అన్నవరం (ప్రత్తిపాడు): 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పది లక్షలకుపైగా ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోతుందని దేవదాయ, ధర్మదాయ శాఖ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పి.మాణిక్యాలరావు అన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో శ్రీసత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి అంతా తానే చేశానని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం నేర్పారన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక కేంద్ర నిధులు ఉన్నాయన్నారు.
ప్రధాని పర్యటనను ఎవరూ అడ్డుకోలేరు...
జనవరి ఆరో తేదీన గుంటూరులో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగసభ జరిగి తీరుతుందని, ఈ సభను ఎవరూ అడ్డుకోలేరని మాణిక్యాలరావు అన్నారు. ఆయన దేశం మొత్తానికి ప్రధాని అని ఎక్కడైనా సభ పెట్టుకునే అధికారం ఆయనకు ఉంటుందన్నారు. ప్రధాని బహిరంగ సభకు భద్రత, తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. సమావేశంలో పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కన్వీనర్ చిలుకూరి రామ్‌కుమార్, అన్నవరం దేవస్థానం ట్రస్టీ శింగిలిదేవి సత్తిరాజు తదితరులు పాల్గొన్నారు.