
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు లొంగి ‘అభివృద్ధి’ కోసం ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చాలామంది తమ నియోజకవర్గాల్లో పాత టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి తలనొప్పిని ఎదుర్కొంటున్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల ప్రవేశాన్ని జీర్ణించుకోలేకపోతున్న పాత టీడీపీ శ్రేణులు కొత్తవారికి వ్యతిరేకంగా అసమ్మతితో రగిలిపోతున్నాయి. పలు నియోజకవర్గాల్లో కొత్త వారిని నిరసిస్తూ తీవ్రస్థాయిలో ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల అసమ్మతులు, నిరసనలు బాహాటంగానే వ్యక్తంకాగా, మరికొన్ని చోట్ల నివురుగప్పిన నిప్పులాగా కొనసాగుతున్నాయి.
చంద్రబాబు జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించడంలేదు. అద్దంకి, కదిరి, బద్వేలు, గూడూరు, కందుకూరు, పాతపట్నం, పామర్రు, ప్రత్తిపాడు వంటి చోట్ల అసమ్మతి స్వరాలు పరాకాష్టకు చేరుకోవడమే కాక, పరస్పరం బాహాబాహీలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫిరాయించిన ఎమ్మెల్యేల రాకను ఆయా నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో వారి చేతిలో ఓటమి పాలైనవారు ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. అయితే చంద్రబాబు వారందరి గొంతుకలను నయానా, భయానా నొక్కివేసి ప్రతిపక్షాన్ని బలహీనపర్చాలనే ఏకైక లక్ష్యంతో ఫిరాయింపుల పర్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పడు అదే ఆ పార్టీతో పాటు ఫిరాయింపుదారులకు శాపంగా పరిణమించింది.
కోస్తాలో తీవ్ర ప్రతిఘటన
బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ పోరాటం చేసి టీడీపీలో చేరిపోయిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రజల నుంచే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. జన్మ భూమి–మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఈశ్వరిని స్థానిక గిరిజనులు ఇన్నాళ్లు లేని అభివృద్ధిని ఒక్క ఏడాదిలో ఏం చేసి చూపిస్తారని ప్రశ్నించడం ఆమెను ఇరకాటంలో పడేసింది. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మొన్నటి ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజు అనుచరుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు.
శత్రుచర్లను శాంతింపజేయడానికి చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినప్పటికీ వ్యవహారం సద్దుమణగలేదు. అరకులో కిడారు సర్వేశ్వరరావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో ఫిరాయించిన జ్యోతుల నెహ్రూకు టీడీపీ కార్యకర్తల నుంచి అసమ్మతి ఎదురవు తోంది. ఆయనపై మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన జ్యోతుల చంటిబాబుతో ఆయనకు బొత్తిగా పొసగడం లేదు. ఇదే జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల సుబ్బారావుపై పోటీ చేసి ఓటమిపాలైన పర్వత సుబ్బారావుకూ సమన్వయం బాగా లోపించిందని తెలుస్తోంది. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, వర్ల రామయ్య మధ్య తీవ్రస్థాయిలో విభేదాలున్నాయి. విజయవాడ (పశ్చిమ) ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు మళ్లీ టీడీపీ టికెట్ లభిస్తుందనే హామీ ఏదీ లేదు.
ప్రకాశంలో భగ్గుమంటున్న విభేదాలు
ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతున్నాయి. స్వప్రయోజనాల కోసం గొట్టిపాటి టీడీపీలో చేరారని బలరాం వర్గం నిత్యం ఆయనపై ధ్వజమెత్తుతోంది. ఇక్కడ పరిస్థితులను సమతౌల్యం చేయడానికి బలరాంకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినా సెగలు, పగలు చల్లారలేదు. ఏదో ఒక సందర్భంలో రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. కందుకూరు నియోజకవర్గంలో పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
ఇటీవల మున్సిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారం, మున్సిపల్ స్థలంలో అక్రమ కట్టడాలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో టీడీపీ నాయకత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి సామాన్య ప్రజల నుంచి బహిరంగంగానే నిరసనలు ఎదురవుతున్నాయి. అశోక్‌రెడ్డి ప్రవేశాన్ని నిరసిస్తూ ఈ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు టీడీపీకి రాజీనామా చేశారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజుకూ స్థానికంగా ఉంటున్న కార్యకర్తలకూ మధ్య పనుల విషయంలో తేడాలున్నాయంటున్నారు. కాంట్రాక్టు పనులను ఎక్కువగా తొలి నుంచీ తన వెంట ఉన్నవారికి డేవిడ్‌రాజు ఇస్తూ టీడీపీలో ఉన్న పాత నేతలను విస్మరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీమలో రగులుతున్న అసమ్మతి
కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ పరిస్థితి అయితే దయనీయంగా తయారైంది. తాజా జన్మభూమి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లినపుడు ఎవరండీ మీరు... అని ప్రజలు తిరగడ్డారు. వైఎస్సార్ జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష, మంత్రులు ఆదినారాయణరెడ్డికి, ఎన్.అమరనాథరెడ్డికి, భూమా అఖిలప్రియకు అసమ్మతి చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయేమోనని సీనియర్ టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment