సాక్షి, అమరావతి : వేసవికి ముందే రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. మరో వారంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్న నేపథ్యంలో అధికార టీడీపీకి అసమ్మతి చెమటలు పట్టిస్తోంది. ఎన్నికల పోటీలో నిలిచే అభ్యర్థుల విషయంలో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరించే తీరుపై ఆ పార్టీ కేడర్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా, తమ అనుచరులు, కార్యకర్తలతో కలిసి అసమ్మతి నేతలు నిరసనలు చేపడుతున్నారు. చంద్రబాబు తీరుకు నిరసనగా కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. మరికొందరు పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా పుట్టపర్తి నియోజకర్గ వడ్డెర సామాజిక వర్గ నాయకులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు మంగళవారం సీఎం నివాసం వద్ద ఆందోళనలు చేపట్టారు. మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మల్లెల జయరాంకు టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుమల వెంకన్న సాక్షిగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఆ తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. జయరాంకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయించి రఘునాథరెడ్డిని ఓడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
అదేవిధంగా రంపచోడవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి మరోసారి టికెట్ ఇవ్వకూడదని ఆ నియోజకవర్గ టీడీపీ నేతలు సీఎం నివాసం ముందు ఆందోళనలు చేపట్టారు. రాజేశ్వరకి తప్ప ఎవ్వరికీ టికెట్ ఇచ్చినా వారిని గెలిపిస్తామని ఆసమ్మతి వర్గం నాయకులు పేర్కొంటున్నారు. ఆమెకు మరోసారి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు.
అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు
మంత్రులు గంటా శ్రీనివాస రావు, శిద్దా రాఘవరావులను రానున్న ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది. విశాఖ నుంచి గంటా, ఒంగోలు నుంచి శిద్దాను పోటీచేయించే అవకాశం ఉంది. అయితే ఎంపీలుగా పోటీ చేసేందుకు అనాసక్తితో ఉన్న వారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలుగానే పోటీ చేస్తామని అధిష్టానాన్ని బతిమిలాడుతున్నారని సమాచారం. ఇక భీమిలి నుంచి సీబీఐ మాజీ డైరక్టర్ జేడీ లక్ష్మీనారాయణను పోటీలో దించాలని టీడీపీ ఆలోచనలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment