సాక్షి, కడప కార్పొరేషన్: టీడీపీ ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్(ఏపీఆర్‌ఐసీ) అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కడప నగరపాలక సంస్థ పరిధిలో ఆ శాఖ ద్వారా సుమారు రూ.30కోట్ల పనులు నామినేషన్ పద్ధతిలో చేపట్టారు. అధికార పార్టీ నాయకులకు కమీషన్లు ముట్టజెప్పి నామమాత్రంగా చేసిన ఆ పనుల్లో నాణ్యత పూర్తిగా కొరవడింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకులకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చి, వారి జేబులు నింపడానికి అనేక వక్రమార్గాలను అనుసరించింది. విభజన హామీ మేరకు కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ నిధుల(ఎస్‌డీపీ)ను ఆ పార్టీ నాయకులు అడ్డదిడ్డంగా దోచుకుతిన్నారు. రాజ్యాంగ బద్ధంగా ప్రజల ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు(ఎస్‌డీఎఫ్) ఇవ్వాల్సి ఉంది.
కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్‌డీఎఫ్ నిధులను ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా వారి చేతిలో ఓటమి పాలైన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిలకు కలెక్టర్ ద్వారా అప్పగించారు. ఇది అప్రజాస్వామికమని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అంటున్నా వారి గోడు వినే నాథుడే కరువయ్యారు. ఈ పనులను ఏ డిపార్ట్‌మెంట్ ద్వారా చేసినా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాల్సి ఉంటుంది. టెండర్లు నిర్వహించిన పనులకు కాంట్రాక్టర్లు కమీషన్లు ఇవ్వరనే ఉద్దేశంతో, టీడీపీ కార్యకర్తలకు లబ్ధి చేకూరాలంటే నామినేషన్‌పై పనులు చేసే సంస్థ కావాలని ఏరి కోరి ఏపీఆర్‌ఐసీని ఎన్నుకున్నారు. దోచుకోవడమే పరమావధిగా ఆర్‌ఐసీ చేపట్టే ప్రతి పనికి సంబంధించి అంచనా వ్యయంలో 15 నుంచి 20 శాతం టీడీపీ నాయకులకు కమీషన్లుపోగా మిగిలిన మొత్తంతో పూర్తి నాసిరకంగా పనులు కానిచ్చారు.
ఆ డిపార్ట్‌మెంట్‌లో పరిమిత సంఖ్యలో ఇంజినీర్లు ఉండటం వల్ల పర్యవేక్షణ కూడా సక్రమంగా ఉండేది కాదు. నాణ్యత లేక రోడ్లు, కాలువలు అర్ధాంతరంగా పాడయ్యే పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో పనులు చేయాల్సిన ఆర్‌ఐసీ సంస్థ పట్టణ ప్రాంతాల్లో చేయడాన్ని కడప నగరపాలక సంస్థలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మహీధర్‌రెడ్డి మున్సిపల్‌శాఖ మంత్రిగా ఉన్నపుడు ఆర్‌ఐసీ శాఖ మున్సిపల్ కార్పొరేషన్లలో పనులు చేపట్టరాదని ఇచ్చిన మెమోను చూపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కడప నగరపాలక సంస్థ ప్రతిపాదించిన పనులనే టీడీపీ నాయకులు కూడా ప్రతిపాదిస్తున్నారని, దీనివల్ల వర్క్స్ డూప్లికేట్ అవుతున్నాయని వారు లేవనెత్తిన అభ్యంతరాలను టీడీపీ నాయకులకు భయపడి అధికారులు విస్మరించారు. కొన్నిచోట్ల నగరపాలక సంస్థ చేసిన పనులను తామే చేసినట్లు చూపి అధికార పార్టీ నాయకులు ఆర్‌ఐసీ ద్వారా బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాము చేసిన పనులకు వారు చేసినట్లు చూపి బిల్లులు కూడా చేసుకున్నారని ఆరోపణలు చేశారు.
విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేసినా...
కడప నగరపాలక సంస్థలో పటిష్టమైన ఇంజినీరింగ్ వ్యవస్థ ఉందని, ఎన్నికోట్ల పనులైనా చేయడానికి, నిర్మాణం తర్వాత తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి కావాల్సిన సిబ్బంది ఉన్నారని, ఆర్‌ఐసీకి అలాంటివేమీ లేవని వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు అనేక సర్వసభ్య సమావేశాల్లో వాదించారు. ఇద్దరు, ముగ్గురు ఇంజినీర్లు తప్ప మరెవరూ లేని ఆ సంస్థతో కడపలాంటి నగరంలో పనులు చేయించడం సరికాదని, కార్పొరేషన్ అనుమతి లేకుండా పనులు చేయరాదని తీర్మాణాలు కూడా చేశారు. ఎవరు అభ్యంతరాలు చెప్పినా, ఎన్ని తీర్మాణాలు చేసినా ఆర్‌ఐసీ అధికారులు వాటిని పట్టించుకోకుండా పనులు చేశారు.
ప్రొటోకాల్‌ను కూడా విస్మరించి, మేయర్, ఎమ్మెల్యేలను ఆహ్వానించకుండా ఎలాం టి అధికారిక హోదా, అర్హత లేని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో ప్రారంభోత్సవాలు చేయిం చారు. పూర్తి నాసిరకంగా జరిగిన ఆ పనులపై విజిలెన్స్ విచారణ చేపట్టాల్సిందిగా నగరపాలక వర్గం ఏకగ్రీవ తీర్మానం చేసినా లాభం లేకుం డా పోయింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినా ఈ పనులన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరగడం వల్ల ఆ విచారణ కూడా ముందుకు సాగలేదు.
టీడీపీ కార్యకర్తలకే పనులు చేశారు
ప్రభుత్వం మంజూరు చేసినా ఎస్‌డీపీ, ఎస్‌డీఎఫ్ నిధులన్నీ 8 మంది టీడీపీ కార్పొరేటర్లు, ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు తప్ప వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లకు కేటాయించలేదు. ఇది అన్యాయని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదు. జనరల్ ఫండ్‌గానీ, ఇతర కేంద్ర నిధులు ఏమొచ్చినా మేయర్, ఎమ్మెల్యేలు అన్ని డివిజన్లకు సమానంగా పంచి అభివృద్ధి చేశారు.
– కె. బాబు, 14వ డివిజన్ కార్పొరేటర్
ప్రజలకు ఉపయోగపడని చోట చేసి
జేబులు నింపుకొన్నారు
ఆర్‌ఐసీ వారు కడపలో పనులు చేసేదానికి లేదు. అయినా అధికార బలంతో చేయించారు. టీడీపీ వాళ్లు 15 శాతం కమీషన్లు తీసుకొని, వర్క్‌లు అమ్ముకొని ఇష్టం వచ్చినట్లు పనులు చేసి జేబులు నింపుకున్నారు. ప్రజలు నివాసం ఉన్నచోట కాకుండా లే ఔట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం పనులు చేశారు.
– ఇసుకపల్లి చైతన్య, 1వ డివిజన్ కార్పొరేటర్
Comments
Please login to add a commentAdd a comment