‘ఎన్నికల’ శంకుస్థాపనలు | TDP Govt Plays Foundation Drama ahead Of Elections | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 28 2018 1:50 PM | Last Updated on Fri, Dec 28 2018 2:06 PM

TDP Govt Plays Foundation Drama a Head Of Elections - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీల సాధనను గాలికొదిలేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సిన ప్రాజెక్టులను తామే చేపడతామంటూ కొత్త రాజకీయ సినిమాకు తెరతీసింది. ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, రాజకీయ ప్రయోజనాలకు పాతరేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం శంకుస్థాపనలతో ప్రజలను నిలువునా వంచిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కీలక పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులపై దృష్టి పెట్టకుండా తీరా ఎన్నికల ముందు శంకుస్థాపనల నాటకం మొదలుపెట్టారు. 

స్టీల్‌ప్లాంట్‌లో కమీషన్ల వేట! 
కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రమే నిర్మించాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవాల్సింది పోయి, అస్మదీయులకు ఈ పనులు కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వమే కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనకు పూనుకుందని సాక్షాత్తూ అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నారు. కడప ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు సంబంధించి మెకాన్‌ సంస్థ అడుగుతున్న వివరాలను అందించకుండా, ఒకపక్క లోటు బడ్జెట్‌ అంటూనే రూ.18,000 కోట్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదో ముఖ్యమంత్రే  చెప్పాలని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం పంతాలకు పోకుండా ఈ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రమే నిర్మించేలా ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సూచించారు. ఈ ప్రాజెక్టును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి టీడీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అధికారులు చెబుతున్నారు. 

వచ్చే నెలలో ‘దుగరాజపట్నం’ ముహూర్తం 
దుగరాజపట్నం ఓడరేవును కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఈ హామీని సాధించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంతో అధికారం పంచుకున్న నాలుగేళ్లపాటు ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కేంద్రం నుంచి వైదొలిగిన తర్వాత ఇప్పుడు తామే సొంతంగా ఓడరేవు నిర్మిస్తామంటూ ప్రభుత్వం డ్రామాలాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు అనుమతుల పరంగా ఇబ్బందులున్నాయని, ప్రత్యామ్నాయం చూపిస్తే రేవు నిర్మించడానికి సిద్ధమంటూ కేంద్రం లేఖలు రాసినా టీడీపీ సర్కారు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం వద్ద మైనర్‌ పోర్టు కట్టడానికి సిద్ధమైతే విభజన చట్టం కింద అక్కడ మేజర్‌ పోర్టు నిర్మించడానికి సిద్ధమంటూ కేంద్రం లేఖ రాసింది. కానీ, ఈ విషయాన్ని ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోర్టుకు శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. జనవరి రెండు లేదా మూడో వారంలో ఈ శంకుస్థాపన జరగనున్నట్లు సమాచారం. 

‘మచిలీపట్నం’లోనూ అదే తంతు 
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్థాపన చేసిన మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో గడిచిన నాలుగేళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం భూ సేకరణ సైతం పూర్తి చేయలేకపోయారు. అయినా హడావిడిగా జనవరి రెండోవారం తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలంటూ సీఎం పేషీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌కు కేటాయించిన ఓడరేవుకు కూడా శంకుస్థాపన చేయాలంటూ ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు.

నిర్మాణం పూర్తికాకున్నా ప్రారంభిస్తారట!
జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత నాలుగేళ్లుగా చెపుతున్నా ఒక్క కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు మినహా ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పడలేదు. నాలుగేళ్లపాటు కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్‌గజపతిరాజు ఉన్నప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో కొత్త ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపనలు చేయడానికి సీఎం సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎంవో కార్యాలయం ఆదేశించిందని అధికారులు పేర్కొన్నారు.

కుప్పంలో చిన్న విమానాలు మాత్రమే దిగే ఎయిర్‌స్ట్రిప్‌కు ముఖ్యమంత్రి జనవరి 2న శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి కాకపోయినా జనవరి నెలాఖరుకు ప్రారంభించాలని యోచిస్తున్నారు. విమానం ఎగరకపోయినా ఎయిర్‌పోర్టును లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందాయి. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడుతున్న అంచనాతో ముందస్తుగానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రచారానికి టీడీపీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement