Dugarajapatnam port
-
దుగరాజపట్నం పోర్టు నిర్మించి తీరుతాం
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దుగరాజపట్నం పోర్టును నిర్మించి తీరుతామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో మంగళవారం సాయంత్రం జరిగిన సమర శంఖారావం సభలో పోలింగ్‌బూత్ కమిటీ సభ్యులు, కన్వీనర్లతో నిర్వహించిన ముఖాముఖీ సందర్భంగా ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ముఖాముఖీలో భాగంగా బూత్ కమిటీ సభ్యులు పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. దుగరాజుపట్నం పోర్టు నిర్మిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు దానిని నెరవేర్చలేదు. మీరు అధికారంలోకి వస్తే దాని నిర్మాణం చేపడతారా? – వెంకటేష్ (సూళ్లూరుపేట నియోజకవర్గం–కొమ్మూరు) జగన్: ఇక్కడే కృష్ణపట్నం పోర్టు ఉంది. తడలో సెజ్‌లు ఉన్నాయి. ఇవి ఉన్నా ఇక్కడ చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఎక్కడో గుజరాత్, రాజస్థాన్, తమిళనాడుకు చెందిన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి.. ‘మీ అందరికీ ఒకటే చెపుతున్నా.. మీరు గ్రామాల్లోకి వెళ్లండి, అన్నా అక్క చెల్లి అని ఆప్యాయంగా పలకరిస్తూ చెప్పండి.. మన అన్న సీఎం అవుతాడు.. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పండి.. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేసి పదిమంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిప్పించే ప్రయత్నం చేస్తాడని చెప్పండి. గ్రామ్లాల్లో రేషన్ కార్డు, ఇళ్లు కావాలన్నా, ఎవరికి ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, నవరత్నాల్లో చేయూత, రైతు భరోసా, బియ్యం కావాలన్నా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో అనుమతి చేయిస్తాడని చెప్పండి. ఎవరి సిఫారసు అవసరం లేదు. మనం అధికారంలోకొస్తే ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వలంటీర్‌గా నియమించి.. రూ.5 వేలు జీతమిస్తాం. అంతకంటే పెద్ద ఉద్యోగమొస్తే దీన్ని వదులుకోవచ్చు. వీరిద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా మీకు ఇంటికొచ్చి అందించేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తారని నిరుద్యోగులు ఇంతకాలం ఎదురుచూశారు. వేలకు వేలు ఖర్చుచేసి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వదు. ఇక ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసిన 90 వేల మంది ఉన్నారు. మొత్తంగా 2.30 లక్షల ఉద్యోగాలున్నాయి. అవన్నీ అన్నొస్తే భర్తీ చేస్తాడని చెప్పండి. అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టం చేసి, పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 70 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తాం. చివరగా దుగరాజపట్నం పోర్టును కచ్చితంగా కట్టితీరుతాం. నెల్లూరులో పాదయాత్ర చేసినప్పుడు మరిచిపోలేని సంఘటన చెప్పండి.. – సుబ్బారెడ్డి (ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు) జగన్: నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మర్చిపోలేని సంఘటన ఒకటి చూశా.. పాదయాత్రలో కలచివేసిన సంఘటన. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక పెద్దాయన, పెద్దమ్మ ఏడ్చుకుంటూ నా దగ్గరకొచ్చారు. పక్కనే వారి గుడిసె. ఆ గుడిసెలో ఒక ఫొటో ఉంది. వారి కొడుకు ఫొటో వేలాడి తీసి ఉంది. అతని పేరు గోపాల్ అనుకుంటా.. అన్నా, ఈ ఫొటోకు దండ వేసి ఉంది నా కొడుకు. ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్నా అని ఏడుస్తూ చెప్పాడు. నాకు చాలా బాధేసింది.. ఎలా చనిపోయాడన్నా అని అడిగితే.. అన్నా నా కొడుక్కి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయన్నా. మంచి స్టూడెంట్ కావడంతో ఇంజనీరింగ్ చదువుతానంటే చేర్పించానన్నా.. ఇంజనీరింగ్ చదివితే తాను బాగుపడతాడు, తనతోపాటు మా బతుకులు బాగుపడుతాయని ఆశపడ్డానన్నా.. ఇంజనీరింగ్‌కు సంవత్సరానికి రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారని అడిగితే.. రూ.30 వేల నుంచి రూ.35 వేలు వస్తుందన్నా, అది కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి అన్నాడు. ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ.70 వేలు అదనంగా అవుతుందని.. నాలుగేళ్లలో రూ.3 లక్షలు చెల్లించాలన్నా ఆ స్థోమత మాకుందాన్నా అని అడిగాడు. నా కొడుకు మొదటి సంవత్సరంలో చదవనంటే చదవమని చెప్పి రూ.70 వేలు తెచ్చిచ్చానన్నా, రెండో సంవత్సరం సెలవులకు ఇంటికొచ్చి నాన్నా రెండో ఏడాదికి కూడా రూ.70 వేలు కావాలని అడిగితే అప్పోసప్పో చేసి తెచ్చిస్తానని చెప్పానని తెలిపాడు. అన్నా నాకొడుకును కాలేజీకి పంపించా. అలా వెళ్లిన నా కొడుకు నా అవస్థ చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడని గోపాలన్న ఏడుస్తూ చెప్పాడు. బహుశా నా జీవితకాలంలో మర్చిపోలేని సంఘటన ఇది. ఆ తర్వాత గోపాలన్న చెప్పింది నవరత్నాల్లో చేర్చా. ప్రతి పేదవారికీ హామీ ఇస్తున్నా. పేదరికానికి, చదువులకు సంబంధం లేకుండా చేస్తా, మన ఇళ్లలో నుంచి ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ కావాలి.. చదువుకోసం పేదరికం అడ్డుకాకుడదు.. గోపాలన్న పడే బాధ ఏతండ్రికీ రాకూడదని చెపుతున్నా.. ప్రతి తల్లికి, తండ్రికి చెపుతున్నా.. చదవాలనుకునే పిల్లాడికి ఉచితంగా చదివించడమే కాకుండా హాస్టల్లో ఉండి చదువుకొనేవారికి మెస్‌చార్జీలకు గాను ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని చెపుతున్నా.. గోపాలన్నా.. నష్టాన్ని వెనక్కి తీసుకురాలేను కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చేస్తానని హామీ ఇస్తున్నా. అన్నా మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఎలా బయటపడాలి? – హరికృష్ణ (సర్వేపల్లి–బ్రహ్మదేవం) జగన్: ఇదే సమస్య ప్రతి గ్రామంలో ఉంది. మంచీచెడు లేకుండా అన్యాయంగా అక్రమ కేసులు పెడుతున్నారు. దేవుడు దయవల్ల మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి అక్రమ కేసును ఉపసంహరిస్తామని హామీ ఇస్తున్నా.. రెండునెలల్లో మంచిరోజులు రాబోతున్నాయి. దగ్గరకు వచ్చేశాం.. కాస్త ఓపిక పట్టండి మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు కదా.. మనం ఎలా ఎదుర్కోవాలి? – శరత్‌కుమార్ (నెల్లూరు సిటీ నియోజకవర్గం) జగన్: ఈ ప్రశ్న ప్రతి మనస్సులో ఉంది. ఒకటే ఒకటి చెపుతున్నా. అన్యాయం ఎక్కువ రోజులు నిలబడదు. అన్యాయం చేసేవారికి దేవుడు శిక్ష వేస్తాడు.. రాత్రి పోయాక పగలు వస్తుంది.. మనం చేయాల్సింది ఒకటే.. ప్రతీ ఇంటికీ వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దని చెప్పండి. అన్న సీఎం అయితే జరిగే మేలును వారికి వివరించి చెప్పండి.. నచ్చజెప్పండి. అన్యాయమైన చంద్రబాబు ప్రభుత్వం ఎంత డబ్బు ఇచ్చినా బంగాళాఖాతంలో కలసిపోయేలా దేవుడే చేస్తాడు. నెల్లూరుజిల్లాలో యువత ఉద్యోగాలకోసం చెన్నై లాంటి నగరాలకు వెళ్తున్నారు. వారికి ఎలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు? – గణేష్ (వెంకటగిరి–టీచర్స్ కాలనీ) జగన్: గణేష్ అడిగిన ప్రశ్నకు ఇంతకుముందే చెప్పా. రేప్పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏవిధంగా ఉద్యోగాలకోసం పాకులాడుతామో చెప్పాను. ప్రత్యేక హోదా గురించి చెపుతా.. హోదా ఇస్తామంటూ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రాన్ని పట్టించుకోకుండా వదిలేయడం చూశాం. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ప్రత్యేకహోదాను చట్టంలో పొందుపరిచి ఉంటే కోర్టుకెళ్లి అయినా ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్లం. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి మోసం చేసింది. టీడీపీని చూశాం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోరాటం చేయాల్సిన వ్యక్తి.. నాలుగేళ్లపాటు బీజేపీతో చిలకా గోరింకల్లా కాపురం చేసి ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి ఎన్నికల ముందు నల్లచొక్కా వేసుకుని ధర్మపోరాట దీక్షలంటూ మోసం చేస్తున్నాడు. ఇదే పవన్‌కల్యాణ్‌ను చూశాం.. ఎన్నికల ముందు బీజేపీ, చంద్రబాబుతో హామీలు అమలు చేయిస్తానని చెప్పాడు. తర్వాత వెన్నుపోటు పొడిచిన వారిలో భాగస్వామ్యమయ్యాడు. ఇక ఎవరినీ నమ్మొద్దు. మన రాష్ట్రానికి సంబంధించిన 25 మంది ఎంపీలను మొత్తంగా మన పార్టీయే తెచ్చుకునేలా చేయండి. అప్పుడు కేంద్రంలో ప్రత్యేక హోదా ఇస్తానని సంతకం పెట్టిన వారికే మద్దతిస్తాం.. ప్రత్యేక హోదా వస్తే హైదరాబాద్‌లా ఉద్యోగ విప్లవం వస్తుంది.. రాయితీలు వస్తాయి.. హోటళ్లు, పరిశ్రమలు, హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుంటే ఇన్‌కంటాక్స్, జీఎస్టీలు చెల్లించాల్సిన అవసరం లేదు. -
కేంద్రం సహకరించకున్నా అభివృద్ధి: సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కేంద్రం సహకరించకు న్నా ఈ ప్రాంత ప్రజల సాకారమయిన రామాయపట్నం పోర్టుతోపాటు షిప్పింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రం దుగరాజపట్నం పోర్టు ఇస్తానని ఇవ్వలేదని.. అందుకే రూ.4,200 కోట్లతో రామాయపట్నం నిర్మిస్తున్నామన్నారు. రామాయపట్నం పోర్టు, ఏషియన్, పల్ప్ అండ్ పేపర్ మిల్లు నిర్మాణానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2021కి 20.26 మిలియన్ టన్నుల కెపాసిటీతో పోర్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఈనెల 29కి అనంతపురంలో కియా పరిశ్రమ తొలి కారు రోడ్డు మీదకు వస్తుందన్నారు. ఎన్నికలు ఒక్క నెల ఉన్నాయనగా అగ్రవర్ణాల రిజర్వేషన్లు తెరపైకి తెచ్చారని, అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. -
‘ఎన్నికల’ శంకుస్థాపనలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని హామీల సాధనను గాలికొదిలేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టాల్సిన ప్రాజెక్టులను తామే చేపడతామంటూ కొత్త రాజకీయ సినిమాకు తెరతీసింది. ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి, రాజకీయ ప్రయోజనాలకు పాతరేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం శంకుస్థాపనలతో ప్రజలను నిలువునా వంచిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కీలక పరిశ్రమలు, పోర్టులు, ఎయిర్‌పోర్టులపై దృష్టి పెట్టకుండా తీరా ఎన్నికల ముందు శంకుస్థాపనల నాటకం మొదలుపెట్టారు. స్టీల్‌ప్లాంట్‌లో కమీషన్ల వేట! కడప ఉక్కు కర్మాగారాన్ని కేంద్రమే నిర్మించాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి చేసి సాధించుకోవాల్సింది పోయి, అస్మదీయులకు ఈ పనులు కట్టబెట్టి, కమీషన్లు కొల్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వమే కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పూనుకుందని సాక్షాత్తూ అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నారు. కడప ఉక్కు కార్మాగారం ఏర్పాటుకు సంబంధించి మెకాన్ సంస్థ అడుగుతున్న వివరాలను అందించకుండా, ఒకపక్క లోటు బడ్జెట్ అంటూనే రూ.18,000 కోట్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేయగలదో ముఖ్యమంత్రే చెప్పాలని సీనియర్ ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం పంతాలకు పోకుండా ఈ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రమే నిర్మించేలా ఒప్పించాలని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సూచించారు. ఈ ప్రాజెక్టును ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి టీడీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో ‘దుగరాజపట్నం’ ముహూర్తం దుగరాజపట్నం ఓడరేవును కేంద్రమే నిర్మిస్తుందని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. ఈ హామీని సాధించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంతో అధికారం పంచుకున్న నాలుగేళ్లపాటు ఈ ప్రాజెక్టు కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. కేంద్రం నుంచి వైదొలిగిన తర్వాత ఇప్పుడు తామే సొంతంగా ఓడరేవు నిర్మిస్తామంటూ ప్రభుత్వం డ్రామాలాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటుకు అనుమతుల పరంగా ఇబ్బందులున్నాయని, ప్రత్యామ్నాయం చూపిస్తే రేవు నిర్మించడానికి సిద్ధమంటూ కేంద్రం లేఖలు రాసినా టీడీపీ సర్కారు స్పందించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రామాయపట్నం వద్ద మైనర్ పోర్టు కట్టడానికి సిద్ధమైతే విభజన చట్టం కింద అక్కడ మేజర్ పోర్టు నిర్మించడానికి సిద్ధమంటూ కేంద్రం లేఖ రాసింది. కానీ, ఈ విషయాన్ని ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోర్టుకు శంకుస్థాపన చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. జనవరి రెండు లేదా మూడో వారంలో ఈ శంకుస్థాపన జరగనున్నట్లు సమాచారం. ‘మచిలీపట్నం’లోనూ అదే తంతు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో శంకుస్థాపన చేసిన మచిలీపట్నం పోర్టు నిర్మాణం విషయంలో గడిచిన నాలుగేళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం భూ సేకరణ సైతం పూర్తి చేయలేకపోయారు. అయినా హడావిడిగా జనవరి రెండోవారం తర్వాత ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలంటూ సీఎం పేషీ నుంచి ఆదేశాలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌కు కేటాయించిన ఓడరేవుకు కూడా శంకుస్థాపన చేయాలంటూ ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. నిర్మాణం పూర్తికాకున్నా ప్రారంభిస్తారట! జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత నాలుగేళ్లుగా చెపుతున్నా ఒక్క కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు మినహా ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు పడలేదు. నాలుగేళ్లపాటు కేంద్ర మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి చెందిన అశోక్‌గజపతిరాజు ఉన్నప్పటికీ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో కొత్త ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపనలు చేయడానికి సీఎం సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎంవో కార్యాలయం ఆదేశించిందని అధికారులు పేర్కొన్నారు. కుప్పంలో చిన్న విమానాలు మాత్రమే దిగే ఎయిర్‌స్ట్రిప్‌కు ముఖ్యమంత్రి జనవరి 2న శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి కాకపోయినా జనవరి నెలాఖరుకు ప్రారంభించాలని యోచిస్తున్నారు. విమానం ఎగరకపోయినా ఎయిర్‌పోర్టును లాంఛనంగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు అందాయి. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న అంచనాతో ముందస్తుగానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రచారానికి టీడీపీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
దుగ్గరాజు పట్నంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: దుగ్గరాజు పట్నం ఓడరేవు తీసుకొని వచ్చేంత వరకు తమ పార్టీ పోరాటం ఆగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ పోర్టును కాపాడేందుకే దుగ్గరాజు పట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన మండిపడ్డారు. సోమవారం దుగ్గరాజు పట్నం పోర్టు నిర్మాణం పురోగతి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేతను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్‌ను కలిసి ఈ విషయంపై చర్చిద్దామని వచ్చానని తెలిపారు. 2018వరకు దుగ్గరాజు పట్నం తొలి దశ పనులు పూర్తికావాల్సి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. చంద్రబాబు ఒక్క లెటర్ రాస్తే.. కేంద్రం ఎనిమిది వేల కోట్లు విడుదల చేయడానికి సిద్దంగా ఉందని నితిన్ గడ్కరీ తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. అయితే బకింగ్ హామ్ కెనాల్‌కు మూడు వేల కోట్ల కేటాయింపులు జరిగేల చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్లు వరప్రసాద్ తెలిపారు. -
ప్యాకేజీకి ఒప్పుకోవడం బాబు చేసిన పెద్ద తప్పు
-
బాబూ.. నోరు ఎందుకు మెదపలేదు
సాక్షి, అమరావతి : పద్నాలుగవ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పలేదని.. ఈ విషయం తెలిసిన తరువాత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఒప్పుకోవడం పెద్ద తప్పు అని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ప్యాకేజీలో అమరావతి నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదువందల కోట్లు ఇస్తామంటే చంద్రబాబు నోరు మూసుకు కూర్చున్నారని విమర్శించారు. రాజధాని కోసం ఎక్కువ నిధులు కావాలంటూ చంద్రబాబు ఎందుకు అడగలేదని ఆయన నిలదీశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్, బొలంగీ తరహాలో నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టుపట్టలేదని ప్రశ్నించారు. దుగరాజపట్నం పోర్టు విషయంలోను చంద్రబాబు అలసత్వం వహించారని వడ్డే ధ్వజమెత్తారు. సాంకేతిక సమస్యల కారణంగా దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు చేయలేమని కేంద్రం చెబితే రామాయపట్నంలో ఏర్పాటు చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడగలేదని నిలదీశారు. రామాయపట్నం పోర్టు నిర్మించమని అడిగితే ఈ సమయానికి 24వేల కోట్లతో ఈపాటికే పోర్టు పనులు జరుగుతుండేవని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు చేసిన తప్పునే మళ్లీ చేస్తున్నారని, అభివృద్ది వికేంద్రీకరణ చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పైనే దృష్టి పెడుతోందని ద్వజమెత్తారు. గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను పూర్తి చేయటానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి భారీ స్థాయిలో అప్పలు తీసుకురావటం దారుణమైన విషయమని ధ్వజమెత్తారు. ఈ నెల 22న చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానాలపై తాను రాసిన 'నేలవిడిచి సాము చేయటం తుగునా..' అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. -
సంపాదనే లక్ష్యంగా ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు
-
'చంద్రబాబు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి'
తిరుపతి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలు పతనం దిశగా వెళుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రెండెకరాల స్థలంలో పంటలు పండించామని చెప్పుకొచ్చాడని గుర్తుచేశారు. అయితే వంకాయలు, బెండకాయలు, పాలు ఎక్కడ అమ్మారో చూపాలని ప్రశ్నించారు. తిరుపతిని లేక్ సిటీగా చేస్తానని చెప్పిన చంద్రబాబు దుగరాజపట్నం ఓడరేవుకు 200 ఎకరాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్, దుగరాజపట్నం ఓడరేవును రద్దు చేసిన ఘనత బీజేపీ, టీడీపీలదేనని ఎద్దేవా చేశారు. ఇదే గనక తెలంగాణలో జరిగి ఉంటే అక్కడి ప్రజల్లో విప్లవం వచ్చి ఉండేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, శ్రీకాళహస్తి–నడికుడి రైల్వే లైన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సీఎంగా చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో తిరుపతి అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, తిరుపతి అభివృద్ధి కోసం 13 రూపాయల పనులు కూడా చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే తిరుపతి అభివృద్ధి జరిగిందన్నారు. 300 పడకల ప్రసూతి ఆసుపత్రికి ‘చంద్ర’గ్రహణం పట్టుకుందని, క్యాన్సర్ ఆసుపత్రిని రద్దు చేశారని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రధాని మోదీ ఒక్కరే లాభపడ్డారని, దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పక్కనుంటూనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేదల గొంతులు కోసి వేల కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు. ఈ సమావేశంలో నైనారు శ్రీనివాసులు, తాళ్లపాక గోపాల్, సావిత్రియాదవ్, శాంతి యాదవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దుగరాజపట్నం పోర్టుపై వెనక్కి తగ్గం
-మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కోట: వాకాడు మండలం దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు విషయంలో వెనక్కి తగ్గేది లేదని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తెలిపారు. మంగళవారం ఆయన కోటలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో పోర్టుకు అనుకూలంగా చట్టం చేశారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోర్టు రాకుండా అడ్డుపడుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పోర్టు సాధన కోసం ఉద్యమించనున్నట్లు చెప్పారు. గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల్ని చైతన్య పరుస్తామన్నారు. ఆయన వెంట పుచ్చలపల్లి సర్పంచ్ ఇంధ్రసేనయ్య, నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంకయ్య, కోట, వాకాడు మండలాల నాయకులు ఉన్నారు. -
పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డు
తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు కోట : మండలంలోని దుగ్గరాజపట్నంలో ఓడరేవు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌రావు ఆరోపించారు. ఆదివారం కోట ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోనే పోర్టును పొందుపరచారని, దానిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. తాను పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తినపుడు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే వెంటనే పోర్టు ఏర్పాటుకు సిద్ధమన్నారు. కష్ణపట్నం పోర్టు ప్రయోజనాల దష్ట్యా సీఎం చంద్రబాబునాయుడు దుగ్గరాజపట్నం పోర్టును వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీని సమర్ధిస్తున్న టీడీపీ నాయకులు హోదాను ఎందుకు వద్దో ప్రజలకు తెలపాలన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను ముఖ్యమంత్రి కష్ణా పుష్కరాలకు వినియోగించి దుర్వినియోగం చేశారన్నారు. నిధులివ్వండి స్థానిక ముస్లిం వీధిలో మహిళలు డ్రైనేజీ కాలువల కోసం నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. కోట దళితవాడలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎంపీ పరిశీలించారు. కోట పంచాయతీకి రూ.6 లక్షలు ఎంపీ నిధులు వెచ్చించి కొత్త ట్రాక్టర్‌ను కొనుగోలు చేయగా దానిని పరిశీలించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సంపత్‌కుమార్‌రెడ్డి, యూత్ రాష్ట్ర కార్యదర్శి పల్లెమల్లు వెంకట కష్ణారెడ్డి, కోట సర్పంచ్ రాఘవయ్య, ఉపసర్పంచ్ ఇంతియాజ్, గాది భాస్కర్ పాల్గొన్నారు. -
దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదు
మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ వాకాడు: యూపీఏ ప్రభుత్వం విభజన చట్టం కింద మంజూరు చేసిన దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం తగదని –తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. వాకాడులో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పోర్టును అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు పోర్టు కోసం దుగరాజపట్నం పోర్టును అడ్డుకోవడం భావితరాలకు ద్రోహం చేయడమేనన్నారు. ఓడరేవు వస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. చారిత్రిక నేపథ్యమున్న ఓడరేవు నిర్మాణం కోసం పోరాడుతామన్నారు. -
దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు
మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్ నాయుడుపేట: దక్షణ భారతదేశంలోనే అత్యంత పెద్దదైన దుగరాజపట్నం ఓడరేవుతో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాయుడుపేట ఆర్అండ్బి అతిథి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుగరాజపట్నం ఓడరేవును తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. వాకాడు, కోట, సూళ్లూరుపేట, నాయుడుపేట, చిట్టమూరు ప్రాంతాలు దుగరాజపట్నం ఓడరేవుతో ఎంతో అభివృద్ధి చెందనుందని అభిప్రాయపడ్డారు. ఓడరేవుకు అనుబంధంగా వంద పరిశ్రమలు వచ్చే అవకాశ ఉందని తద్వారా లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పొందడంతో పాటు లక్షమంది రైతులు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రైవేటు పోర్టుల నుంచి హెలికాప్టర్లను వినియోగించుకుంటూ వారికి వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటుకు అమ్ముడు పోతున్న జిల్లా కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిని చూస్తుంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు, వెంకటయ్య, సుబ్బయ్య ఉన్నారు. -
దుగ్గరాజుపట్నం పోర్టు ఏమైంది?
బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి నెల్లూరు(బారకాసు) : దుగ్గరాజుపట్నం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని తన స్వగృహంలో బుధవారం ఆయన విలేకరల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం విభజన హామీలను అమలు చేయడంలేదని పదేపదే టీడీపీ నేతలు ఆరోపించడం సరికాదన్నారు. పోర్టును మంజూరుచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన భూమిని సమీకరించడంతో పాటు పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. కేంద్రం ఏంచేయడంలేదని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు పోర్టు గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. నాయకులు మొద్దు శ్రీనివాసులు, బాలిరెడ్డి మారుతీకుమార్‌రెడ్డి, అన్నం శ్రీనివాసులు, బండారు సురేష్‌నాయుడు, వి.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
దుగరాజపట్నం పోర్టుపై నివేదిక సిద్ధం
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక యోగ్యత నివేదిక (ఫీజిబిలిటీ రిపోర్ట్) సిద్ధమైందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సాగరమాల కార్యక్రమం కింద కొత్త పోర్టుల ప్రతిపాదన, ఏర్పాటు, నిర్మాణంలో ఉన్న పోర్టులకు సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఏపీలోని దుగరాజపట్నం, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్, మహారాష్ట్రలోని వధవన్, తమిళనాడులోని ఈనాయంలలో ప్రధాన నౌకాశ్రయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. -
దుగరాజపట్నం పోర్టు నిర్మించాలి
లోక్‌సభలో తిరుపతి ఎంపీ వరప్రసాద్ నిర్మిస్తామని మంత్రి నితిన్‌గడ్కరీ స్పష్టమైన హామీ తిరుపతి: దుగరాజపట్నం ఓడరేవును నిర్మించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. లోక్‌సభలో గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దీనిని నిర్మిస్తామని స్పష్టం గా ఉందని, ఆ మేరకు వెంటనే దీనిని నిర్మించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీంతో పాటు ఇప్పటికే ఓడరేవు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చాయన్నారు. వైజాగ్ పోర్టు నుంచి నిపుణుల బృందం కూడా వచ్చి పరిస్థితులు అధ్యయనంచేసి కట్టడానికి అనువుగా ఉందని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో వారు ఏర్పాటుచేసిన సమావేశానికి కూడా తాను వెళ్లినట్టు వివరించారు. శ్రీహరికోటవారు సైతం కొన్ని నిబంధనలు పెట్టి ఓడరేవును నిర్మించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పోర్టు వల్ల గూడూరు, సర్వేపల్లి, నాయుడుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు లబ్ధిపొందుతాయన్నారు. దీంతో పాటు బాగా వెనుకబడిన మండలాలు చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు, సూళ్లూరుపేట, చిల్లకూరు, ముత్తుకూరు మండలాలు సైతం అభివృద్ధి చెందుతాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనికితోడు ఓడరేవుకు సమీపంలోనే హౌరా-చెన్నై నేషనల్ హైవే, రైల్వేట్రాక్ విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్రంలో లాభాల్లో ఉన్న పోర్టు నుంచి రూ.300కోట్లు తీసుకుని దీనిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దుగరాజపట్నం ఓడరేవును నిర్మిస్తే దాని ప్రభావం కృష్ణపట్నం ఓడరేవుపై పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేహిస్తున్నారని, రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తే కేంద్రం ఓడరేవు నిర్మించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. -
నెల్లూరు జిల్లాలో మెరైన్ ఇన్స్టిట్యూట్
హైదరాబాద్: నెల్లూరు జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రకటించింది. రాజధానిపై సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏయే జిల్లాకు ఏమేం చేస్తామో ఈ సందర్భంగా ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో ఆటో మొబైల్ హబ్, ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పులికాట్ సరస్సును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బీసీఐసీ వాడలు, దుగరాజపట్నం పోర్టు అభివృద్ధి చేస్తామని హామీయిచ్చారు. -
పోర్టు ప్రతిపాదిత భూములను పరిశీలించిన కేంద్ర కమిటీ
వాకాడు: మండలంలోని తూపిలిపాళెం వద్ద రూ.9,800 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకుంటున్న దుగరాజపట్నం ఓడరేవుకు సంబంధించి అనుకూల, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూముల పరిశీలనకు సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుల బృందం వచ్చింది. తొలుత వాకాడు స్వర్ణముఖి అతిథిగృహంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో దాదాపు రెండుగంటలు పాటు కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు ఫారెస్టు, వైల్డ్‌లైఫ్, ఎన్ఐఓటీ అధికారులు దుగరాజపట్నం పోర్టుకు ప్రతిపాదించిన భూములను తూపిలిపాళెం వద్ద పరిశీలించారు. అలాగే సముద్రం పక్కనే ఉన్న ఫారెస్టు భూములను పరిశీలించారు. తూపిలిపాళెం వద్ద ప్రధానంగా పర్యావరణ అనుమతులపై కూడా అధికారులు చర్చలు జరిపారు. గత ప్రభుత్వ హయాంలోనే పర్యావరణ అనుమతులు వచ్చాయని, విశాఖపట్నం పోర్టు ట్రస్టు అధికారులు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తుండగా ఎన్నికల కోడ్ అడ్డం కిగా మారిందని, ఇప్పుడు పరిశీలన ఏమిటని కేంద్ర కమిటీ సభ్యులను విలేకరులు ప్రశ్నిం చారు. పోర్టుకు ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదని కేంద్రకమిటీ సభ్యుడు ఆర్ రాధాకృష్ణన్ జవాబిచ్చారు. ఇంతకూ దుగరాజపట్నం పోర్టు వస్తుందా, రాదా? లేదా మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని ఆయనను ప్రశ్నించగా పోర్టు ఏర్పాటుకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయా, లేవా? అనే విషయంపై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యుల బృందం పరిశీలన నిమిత్తం ఇక్కడకు వచ్చిందన్నారు. పోర్టు వస్తుందా, రాదా? అనేది తాము చెప్పకూడదని వారు సమాధానం దాటవేశారు. నివేదికను కేంద్రానికి అందజేస్తామన్నారు. పరిశీలించిన వారిలో ఆర్ రాధాకృష్ణతో పాటు మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఎంఓఈఎఫ్ లలితకపూర్, కమిటీ సభ్యులు ఎంవీ రమణమూర్తి తదితరులు ఉన్నారు. కమిటీతో మాట్లాడిన వారిలో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు సత్యనారాయణ, వేణుప్రసాద్, సెంట్రల్ కమిటీ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు కేఎస్ రెడ్డి, తిరుపతి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రవికుమార్, నెల్లూరు డీఎఫ్ఓ రాంబాబు, వైల్డ్‌లైఫ్ సూళ్లూరుపేట డీఎఫ్ఓ చంద్రశేఖర్‌రాజు, గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.