'చంద్రబాబు దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి'
తిరుపతి : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలు పతనం దిశగా వెళుతున్నాయని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రెండెకరాల స్థలంలో పంటలు పండించామని చెప్పుకొచ్చాడని గుర్తుచేశారు. అయితే వంకాయలు, బెండకాయలు, పాలు ఎక్కడ అమ్మారో చూపాలని ప్రశ్నించారు.
తిరుపతిని లేక్ సిటీగా చేస్తానని చెప్పిన చంద్రబాబు దుగరాజపట్నం ఓడరేవుకు 200 ఎకరాలు ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్, దుగరాజపట్నం ఓడరేవును రద్దు చేసిన ఘనత బీజేపీ, టీడీపీలదేనని ఎద్దేవా చేశారు. ఇదే గనక తెలంగాణలో జరిగి ఉంటే అక్కడి ప్రజల్లో విప్లవం వచ్చి ఉండేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మూడేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, శ్రీకాళహస్తి–నడికుడి రైల్వే లైన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. సీఎంగా చంద్రబాబు 13 ఏళ్ల పాలనలో తిరుపతి అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, తిరుపతి అభివృద్ధి కోసం 13 రూపాయల పనులు కూడా చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే తిరుపతి అభివృద్ధి జరిగిందన్నారు.
300 పడకల ప్రసూతి ఆసుపత్రికి ‘చంద్ర’గ్రహణం పట్టుకుందని, క్యాన్సర్ ఆసుపత్రిని రద్దు చేశారని చెప్పారు. నోట్ల రద్దుతో ప్రధాని మోదీ ఒక్కరే లాభపడ్డారని, దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పక్కనుంటూనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేదల గొంతులు కోసి వేల కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు. ఈ సమావేశంలో నైనారు శ్రీనివాసులు, తాళ్లపాక గోపాల్, సావిత్రియాదవ్, శాంతి యాదవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.