దుగరాజపట్నం ఓడరేవును నిర్మించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు.
లోక్‌సభలో తిరుపతి ఎంపీ వరప్రసాద్
నిర్మిస్తామని మంత్రి నితిన్‌గడ్కరీ స్పష్టమైన హామీ
తిరుపతి: దుగరాజపట్నం ఓడరేవును నిర్మించాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. లోక్‌సభలో గురువారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దీనిని నిర్మిస్తామని స్పష్టం గా ఉందని, ఆ మేరకు వెంటనే దీనిని నిర్మించాలని కేంద్రప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీంతో పాటు ఇప్పటికే ఓడరేవు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు వచ్చాయన్నారు. వైజాగ్ పోర్టు నుంచి నిపుణుల బృందం కూడా వచ్చి పరిస్థితులు అధ్యయనంచేసి కట్టడానికి అనువుగా ఉందని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో వారు ఏర్పాటుచేసిన సమావేశానికి కూడా తాను వెళ్లినట్టు వివరించారు. శ్రీహరికోటవారు సైతం కొన్ని నిబంధనలు పెట్టి ఓడరేవును నిర్మించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పోర్టు వల్ల గూడూరు, సర్వేపల్లి, నాయుడుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు లబ్ధిపొందుతాయన్నారు.
దీంతో పాటు బాగా వెనుకబడిన మండలాలు చిట్టమూరు, కోట, వాకాడు, గూడూరు, సూళ్లూరుపేట, చిల్లకూరు, ముత్తుకూరు మండలాలు సైతం అభివృద్ధి చెందుతాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనికితోడు ఓడరేవుకు సమీపంలోనే హౌరా-చెన్నై నేషనల్ హైవే, రైల్వేట్రాక్ విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయమై కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్రంలో లాభాల్లో ఉన్న పోర్టు నుంచి రూ.300కోట్లు తీసుకుని దీనిని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దుగరాజపట్నం ఓడరేవును నిర్మిస్తే దాని ప్రభావం కృష్ణపట్నం ఓడరేవుపై పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందేహిస్తున్నారని, రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తే కేంద్రం ఓడరేవు నిర్మించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.