పోర్టు ప్రతిపాదిత భూములను పరిశీలించిన కేంద్ర కమిటీ
వాకాడు: మండలంలోని తూపిలిపాళెం వద్ద రూ.9,800 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకుంటున్న దుగరాజపట్నం ఓడరేవుకు సంబంధించి అనుకూల, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూముల పరిశీలనకు సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుల బృందం వచ్చింది. తొలుత వాకాడు స్వర్ణముఖి అతిథిగృహంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో దాదాపు రెండుగంటలు పాటు కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు ఫారెస్టు, వైల్డ్‌లైఫ్, ఎన్‌ఐఓటీ అధికారులు దుగరాజపట్నం పోర్టుకు ప్రతిపాదించిన భూములను తూపిలిపాళెం వద్ద పరిశీలించారు. అలాగే సముద్రం పక్కనే ఉన్న ఫారెస్టు భూములను పరిశీలించారు. తూపిలిపాళెం వద్ద ప్రధానంగా పర్యావరణ అనుమతులపై కూడా అధికారులు చర్చలు జరిపారు.
గత ప్రభుత్వ హయాంలోనే పర్యావరణ అనుమతులు వచ్చాయని, విశాఖపట్నం పోర్టు ట్రస్టు అధికారులు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తుండగా ఎన్నికల కోడ్ అడ్డం కిగా మారిందని, ఇప్పుడు పరిశీలన ఏమిటని కేంద్ర కమిటీ సభ్యులను విలేకరులు ప్రశ్నిం చారు. పోర్టుకు ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదని కేంద్రకమిటీ సభ్యుడు ఆర్ రాధాకృష్ణన్ జవాబిచ్చారు. ఇంతకూ దుగరాజపట్నం పోర్టు వస్తుందా, రాదా? లేదా మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని ఆయనను ప్రశ్నించగా పోర్టు ఏర్పాటుకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయా, లేవా? అనే విషయంపై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యుల బృందం పరిశీలన నిమిత్తం ఇక్కడకు వచ్చిందన్నారు.
పోర్టు వస్తుందా, రాదా? అనేది తాము చెప్పకూడదని వారు సమాధానం దాటవేశారు. నివేదికను కేంద్రానికి అందజేస్తామన్నారు. పరిశీలించిన వారిలో ఆర్ రాధాకృష్ణతో పాటు మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఎంఓఈఎఫ్ లలితకపూర్, కమిటీ సభ్యులు ఎంవీ రమణమూర్తి తదితరులు ఉన్నారు. కమిటీతో మాట్లాడిన వారిలో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు సత్యనారాయణ, వేణుప్రసాద్, సెంట్రల్ కమిటీ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు కేఎస్ రెడ్డి, తిరుపతి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రవికుమార్, నెల్లూరు డీఎఫ్‌ఓ రాంబాబు, వైల్డ్‌లైఫ్ సూళ్లూరుపేట డీఎఫ్‌ఓ చంద్రశేఖర్‌రాజు, గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.