Land surveying
-
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే..
సాక్షి, జగ్గయ్యపేట: భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ల పాడు గ్రామంలో రాష్ట్ర మంత్రులు మంగళవారం ప్రారంభించారు. క్రాస్ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పేర్నినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, రక్షణ నిధి, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, భూ రికార్డుల శాఖ డైరెక్టర్ డా.ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం నిర్ణయం చారిత్రాత్మకం.. డిప్యూటీ సీఎం సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వందేళ్ల క్రితం సమగ్ర భూసర్వే జరిగిందని.. భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. న్యాయస్థానాల్లో 60 శాతం పైగా భూ వివాదాలే నడుస్తున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో కూడా భూ వివాదాలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. భూ వివాదాలకు చెక్ పెట్టడమే భూముల రీ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. భూ సర్వే పెద్ద యజ్ఞం.. ‘రాష్ట్రంలో 3.31లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా భూముల రీసర్వే చేసేందుకు రెండేళ్లు పడుతుంది. భూములను రీసర్వే చేయడమంటే పెద్ద యజ్ఞం. భూమి ఉన్న యజమానికి భద్రత లేని పరిస్థితి ఉంది. సుపరిపాలన అందించడమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన భూ హక్కుల పరిరక్షణ చట్టం దేశంలోలో ఎక్కడా లేదు. ఈ చట్టం ప్రకారం మీ భూమి ని ఎవరైనా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. కచ్చితమైన భూ రికార్డులు ఉంటేనే చట్టం సమర్థంగా అమలు చేయడం సాధ్యపడుతుంది. భూముల రికార్డులను సక్రమంగా, పటిష్టంగా నిర్వహించడమే భూముల రీసర్వే ముఖ్య లక్ష్యం’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు రీసర్వేతో రైతులకు భద్రత.. మున్సబుల కాలంలో ఏటా జమాబందీ నిర్వహించి భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేవారని.. తర్వాత కాలంలో భూముల రికార్డుల నిర్వహణను గాలికి వదిలేశారని చెప్పారు. భూ రికార్డులను సమర్థంగా తయారు చేసి రైతులకు భద్రత, ప్రయోజనం కల్పించడమే భూముల రీసర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. రీసర్వే సమగ్రంగా జరిపేందుకు సహకరించాలని రైతులను ఆయన కోరారు. 0.1 శాతం కూడా తేడా లేకుండా సరికొత్త రికార్డులు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. ఇనాం భూముల పరిరక్షణ చట్టాన్ని రాబోయే శాసన సభ సమావేశాల్లో తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు. భూముల రీసర్వే పూర్తయితే యజమానులకు వారి భూములపై సంపూర్ణ భద్రత వస్తుందని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం: మంత్రి పేర్ని నాని రెవెన్యూ రికార్డుల తయారీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చూడబోతుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. భూములు కొనుగోలు చేయడం సులువేనని.. కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పాస్ బుక్కులు తీసుకురావడం చాలా కష్టమన్నారు. ముందు వీఆర్వోకు నచ్చాలి. తర్వాత ఆర్ఐ, తహసిల్దారు వద్ద ఎక్కడా రిజెక్ట్ కాకుండా ఆమోదించుకోవాల్సి ఉందన్నారు. సర్వే చేయించడం సహా పాస్ పుస్తకాలు సంపాదించాలంటే తల ప్రాణం తోకకి వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. ‘భూముల సర్వే చేయించుకోవాలంటే రైతులకు శిరోభారంగా మారింది. రైతుల కష్టాలు తీర్చడం సహా వారికి ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. భూముల రీసర్వే ద్వారా అందరికీ మంచి ప్రయోజనాలు దక్కుతాయి. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తోందని’ పేర్ని నాని పేర్కొన్నారు. -
వేతనాలు లేని కొలువులు
సాక్షి, మార్టూరు(ప్రకాశం): భూ సర్వేకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. నిరుద్యోగులుగా ఉన్న అర్హులైన వారిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా తీసుకుని మండలాల్లో నియమించడం జరిగింది. వీరికి వేతనాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకుండా సర్వే కోసం అర్జీదారుల చలానా రూపములో చల్లించే 500 రూపాయలను వీరికి చల్లించేలా ప్రకటించి ఆమొత్తాన్ని వీరి ఖాతాల్లో నేరుగా చెల్లిస్తామంటూ వీరి బ్యాంకు ఖాతాల వివరాలను రెండేళ్ల క్రితమే తీసుకున్నట్లు చెప్తున్నారు. కానీ ఇంతవరకు వీరి ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం. గతంలో సర్వే కోసం అర్జీదారులు చెల్లించాల్సిన చలాన 250 రూపాయలు కాగా వీరికి వేతనానికి బదులు ఇవ్వవలసిన భత్యం కోసం చలానా రుసుమును 500 రూపాయలకు పెంచి రైతులపై భారమైతే వేశారు కానీ వీరికి ఇవ్వకపోవడం విశేషం. సంవత్సరాల తరబడి వీరి పోరాటంలో ఫలితంగా సంబంధిత మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి గత సంవత్సరం మే 9వ తేదీ లైసెన్స్డు సర్వేయర్లను అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమిస్తానని ప్రకటించి విధివిధాలను రూపొందించవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ క్రమములో అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ప్రకాశం జిల్లాకు 112 మందికి అదనంగా టాస్క్ఫోర్సు విభాగానికి ఐదుగురు కలిపి 117 మంది అవసరమని రాష్ట్రవ్యాప్తంగా 1405 మందిని అసిస్టెంట్ సర్వేయర్లుగా నియమించాల్సిసిన అవసరం ఉందని నివేదికను రూపొందించారు. కనీసవేతనంగా 21,534 రూపాయలుగా రూపొందించిన నివేదికను చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునీత్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతనెల 6వ తేదీ పంపిన యూనియన్ నాయకులు చెప్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు పద్ధతిన లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి కనీస వేతనంగా రూ. 18 వేలు ఇస్తున్నట్లు వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న తమకు ఎన్నికల తరణంలోనైనా వేతనాలు ప్రకటిస్తే జీఓ విడుదల చేయాలని వీరు కోరుతున్నారు. సంవత్సరాల తరబడి వేతనాలు లేవు సంవత్సరాల తరబడి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. పనిభారం చాలా ఎక్కువగా ఉన్నా.. విధులు నిర్వహిస్తున్నాం. ఎన్నికల సమయంలోనైనా సమస్య పరిష్కారమవుతుందని ఎదురు చూస్తున్నాం. - భాస్కర్‌రెడ్డి, లైసెన్స్డ్ సర్వేయర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు సమస్యలు త్వరగా పరిష్కరించాలి రెండు సంవత్సరాలకు పైగా పైసా వేతనం లేదు. చలానా రుసుమును ఖాతాలో జమచేస్తామన్నారు. అదీలేదు. ఇప్పటికైనా సమస్యలు త్వరగా పరిష్కరించాలి. - వెంకటేష్, లైసెన్స్డ్ సర్వేయర్ మార్టూరు -
పోర్టు ప్రతిపాదిత భూములను పరిశీలించిన కేంద్ర కమిటీ
వాకాడు: మండలంలోని తూపిలిపాళెం వద్ద రూ.9,800 కోట్ల వ్యయంతో నిర్మించాలనుకుంటున్న దుగరాజపట్నం ఓడరేవుకు సంబంధించి అనుకూల, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూముల పరిశీలనకు సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర కమిటీ సభ్యుల బృందం వచ్చింది. తొలుత వాకాడు స్వర్ణముఖి అతిథిగృహంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో దాదాపు రెండుగంటలు పాటు కమిటీ సభ్యులు చర్చించారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు ఫారెస్టు, వైల్డ్‌లైఫ్, ఎన్ఐఓటీ అధికారులు దుగరాజపట్నం పోర్టుకు ప్రతిపాదించిన భూములను తూపిలిపాళెం వద్ద పరిశీలించారు. అలాగే సముద్రం పక్కనే ఉన్న ఫారెస్టు భూములను పరిశీలించారు. తూపిలిపాళెం వద్ద ప్రధానంగా పర్యావరణ అనుమతులపై కూడా అధికారులు చర్చలు జరిపారు. గత ప్రభుత్వ హయాంలోనే పర్యావరణ అనుమతులు వచ్చాయని, విశాఖపట్నం పోర్టు ట్రస్టు అధికారులు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తుండగా ఎన్నికల కోడ్ అడ్డం కిగా మారిందని, ఇప్పుడు పరిశీలన ఏమిటని కేంద్ర కమిటీ సభ్యులను విలేకరులు ప్రశ్నిం చారు. పోర్టుకు ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు రాలేదని కేంద్రకమిటీ సభ్యుడు ఆర్ రాధాకృష్ణన్ జవాబిచ్చారు. ఇంతకూ దుగరాజపట్నం పోర్టు వస్తుందా, రాదా? లేదా మరో ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని ఆయనను ప్రశ్నించగా పోర్టు ఏర్పాటుకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయా, లేవా? అనే విషయంపై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సభ్యుల బృందం పరిశీలన నిమిత్తం ఇక్కడకు వచ్చిందన్నారు. పోర్టు వస్తుందా, రాదా? అనేది తాము చెప్పకూడదని వారు సమాధానం దాటవేశారు. నివేదికను కేంద్రానికి అందజేస్తామన్నారు. పరిశీలించిన వారిలో ఆర్ రాధాకృష్ణతో పాటు మెంబర్ ఆఫ్ సెక్రటరీ ఎంఓఈఎఫ్ లలితకపూర్, కమిటీ సభ్యులు ఎంవీ రమణమూర్తి తదితరులు ఉన్నారు. కమిటీతో మాట్లాడిన వారిలో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, విశాఖపట్నం పోర్టు అథారిటీ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రామచంద్రరావు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు సత్యనారాయణ, వేణుప్రసాద్, సెంట్రల్ కమిటీ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు కేఎస్ రెడ్డి, తిరుపతి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రవికుమార్, నెల్లూరు డీఎఫ్ఓ రాంబాబు, వైల్డ్‌లైఫ్ సూళ్లూరుపేట డీఎఫ్ఓ చంద్రశేఖర్‌రాజు, గూడూరు ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.