భూ వివాదాలకు చెక్ పెట్టేందుకే.. | AP Ministers Started The Land Survey Project In Krishna District | Sakshi
Sakshi News home page

రీసర్వేతో భూ యాజమానులకు సంపూర్ణ భద్రత 

Published Tue, Feb 18 2020 5:46 PM | Last Updated on Tue, Feb 18 2020 8:45 PM

AP Ministers Started The Land Survey Project In Krishna District - Sakshi

సాక్షి, జగ్గయ్యపేట: భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే పైలెట్ ప్రాజెక్టును రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ల పాడు గ్రామంలో రాష్ట్ర మంత్రులు మంగళవారం ప్రారంభించారు. క్రాస్ నెట్ వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పేర్నినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, రక్షణ నిధి, కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత, భూ రికార్డుల శాఖ డైరెక్టర్‌ డా.ఎన్‌ ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

సీఎం నిర్ణయం చారిత్రాత్మకం..
డిప్యూటీ సీఎం సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వందేళ్ల క్రితం సమగ్ర భూసర్వే జరిగిందని.. భూములను రీసర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. న్యాయస్థానాల్లో 60 శాతం పైగా భూ వివాదాలే నడుస్తున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో కూడా భూ వివాదాలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. భూ వివాదాలకు చెక్‌ పెట్టడమే భూముల రీ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.

భూ సర్వే పెద్ద యజ్ఞం..
‘రాష్ట్రంలో 3.31లక్షల ఎకరాల భూమి సర్వే చేయాల్సి ఉంది. ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా భూముల రీసర్వే చేసేందుకు రెండేళ్లు పడుతుంది. భూములను రీసర్వే చేయడమంటే పెద్ద యజ్ఞం. భూమి ఉన్న యజమానికి భద్రత లేని పరిస్థితి ఉంది. సుపరిపాలన అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. రాష్ట్రంలో అమల్లోకి తెచ్చిన భూ హక్కుల పరిరక్షణ చట్టం దేశంలోలో ఎక్కడా లేదు. ఈ చట్టం ప్రకారం మీ భూమి ని ఎవరైనా దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటే ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లిస్తుంది. కచ్చితమైన భూ రికార్డులు ఉంటేనే చట్టం సమర్థంగా అమలు చేయడం సాధ్యపడుతుంది. భూముల రికార్డులను సక్రమంగా, పటిష్టంగా నిర్వహించడమే భూముల రీసర్వే ముఖ్య లక్ష్యం’ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు

రీసర్వేతో రైతులకు భద్రత..
మున్సబుల కాలంలో ఏటా జమాబందీ నిర్వహించి భూ రికార్డులు సక్రమంగా నిర్వహించేవారని.. తర్వాత కాలంలో భూముల రికార్డుల నిర్వహణను గాలికి వదిలేశారని చెప్పారు. భూ రికార్డులను సమర్థంగా తయారు చేసి  రైతులకు భద్రత,  ప్రయోజనం కల్పించడమే భూముల రీసర్వే ఉద్దేశమని పేర్కొన్నారు. రీసర్వే సమగ్రంగా జరిపేందుకు సహకరించాలని రైతులను ఆయన కోరారు. 0.1 శాతం కూడా తేడా లేకుండా సరికొత్త రికార్డులు తయారు చేసేలా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. ఇనాం భూముల పరిరక్షణ చట్టాన్ని రాబోయే శాసన సభ సమావేశాల్లో తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.  భూముల రీసర్వే పూర్తయితే యజమానులకు వారి భూములపై సంపూర్ణ భద్రత వస్తుందని సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం: మంత్రి పేర్ని నాని
రెవెన్యూ రికార్డుల తయారీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చూడబోతుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. భూములు కొనుగోలు చేయడం సులువేనని.. కానీ ఎమ్మార్వో కార్యాలయంలో పాస్ బుక్కులు తీసుకురావడం చాలా కష్టమన్నారు. ముందు వీఆర్వోకు నచ్చాలి. తర్వాత ఆర్ఐ, తహసిల్దారు వద్ద ఎక్కడా రిజెక్ట్ కాకుండా ఆమోదించుకోవాల్సి ఉందన్నారు. సర్వే చేయించడం సహా పాస్‌ పుస్తకాలు సంపాదించాలంటే తల ప్రాణం తోకకి వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. ‘భూముల సర్వే చేయించుకోవాలంటే రైతులకు శిరోభారంగా మారింది. రైతుల కష్టాలు తీర్చడం సహా వారికి ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. భూముల రీసర్వే ద్వారా అందరికీ మంచి ప్రయోజనాలు దక్కుతాయి.  రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందిస్తోందని’  పేర్ని నాని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement